మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్ నుండి మన భాగ్యనగరం హైదరాబాద్ (Hyderabad) వెళ్లే ప్రయాణికులకు ఒక అద్భుతమైన వార్త. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇండోర్-ఇచ్చాపూర్ జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కొత్త హైవే అందుబాటులోకి వస్తే.. కఠినమైన కొండ ప్రాంతాల గుండా ప్రయాణించే ఇబ్బందులు తప్పడమే కాకుండా ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుంది.

కొండలను తొలిచి మూడు భారీ సొరంగాలు
ఈ హైవే నిర్మాణంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. భారీ పర్వతాలను తొలిచి మూడు అత్యాధునిక సొరంగ మార్గాలను (Tunnels) నిర్మిస్తున్నారు. ఇండోర్‌లోని తేజాజీ నగర్ నుండి ఖర్గోన్ జిల్లాలోని బలవాడ వరకు ఉన్న 33.40 కిలోమీటర్ల మేర రహదారి చాలా క్లిష్టమైన కొండ ప్రాంతాల గుండా వెళ్తుంది. ఇక్కడ ఘాట్ రోడ్లు చాలా ప్రమాదకరంగా, ఇరుగ్గా ఉంటాయి. ప్రయాణికులు ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి మోడ్రన్ ఎలక్ట్రానిక్ బ్లాస్టింగ్ టెక్నాలజీని ఉపయోగించి భేరుఘాట్ (575 మీటర్లు), చోరల్ ఘాట్ (550 మీటర్లు), , బైగ్రామ్ (480 మీటర్లు) వద్ద మూడు టన్నెల్స్ నిర్మిస్తున్నారు.
సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం
ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్లపై ప్రయాణం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ముఖ్యంగా భారీ వాహనాలు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ అవ్వడమే కాకుండా ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ కొత్త ఫోర్-లేన్ హైవే అందుబాటులోకి రావడం వల్ల అటు ఇండోర్ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు, ఇటు పర్యాటకులకు ఎంతో మేలు జరుగుతుంది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని, ట్రాఫిక్ సమస్యలు పరిష్కారమవుతాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ రూట్ వల్ల కలిగే ప్రయోజనాలు
ఈ కొత్త రహదారి కేవలం రెండు నగరాలను కలపడమే కాకుండా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాన్ని సందర్శించే భక్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మహారాష్ట్రలోని జల్గావ్ మీదుగా హైదరాబాద్ (Hyderabad) చేరుకోవడానికి ఇది అత్యంత వేగవంతమైన మార్గంగా మారనుంది. వ్యాపార రీత్యా కూడా ఇండోర్, హైదరాబాద్ నగరాల మధ్య సరుకు రవాణా మరింత సులభతరం అవుతుంది.
ఏదేమైనా డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తయితే.. వచ్చే ఏడాది ప్రారంభం నుండి మనం ఈ సరికొత్త హైవేపై ప్రయాణించవచ్చు. ప్రకృతి అందాల మధ్య సొరంగ మార్గాల గుండా ప్రయాణం ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.


Click it and Unblock the Notifications