ఇక మీదట ఎంఎన్‌పీ.. అంటే మొబైల్ నంబర్ మారకుండా, నెట్‌వర్క్ ఆపరేటర్‌ను మార్చుకునేందుకు వీలయ్యే మొబైల్ నంబర్ పోర్టబులిటీ మూడు రోజుల్లోనే పూర్తికానుంది. ఈ మేరకు ఈ ప్రక్రియకు సంబంధించి సవరించిన నిబంధనలను ప్రజల దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఒక పబ్లిక్ నోటీసు జారీ చేసింది.
ట్రాయ్ ఆదేశాల ప్రకారం.. ఈ నెల 16 నుంచి ఎంఎన్‌పీ కొత్త ప్రక్రియ అమలులోకి వస్తోంది. ఈ కొత్త విధానం ప్రకారం.. ఒకే సర్కిల్ ప్రాంతంలో ఎంఎన్‌పీకి దరఖాస్తు చేసుకుంటే, యూపీసీ కోడ్.. అంటే యూనిక్ పోర్టింగ్ కోడ్ విడుదలకు 3 రోజులు, వేర్వేరు సర్కిళ్ల పరిధిలో అయితే కోడ్ విడుదలకు 5 రోజులు గడువిస్తారు.

అయితే ఈ కొత్త మొబైల్ నంబర్ పోర్టబులిటీ ప్రక్రియ గడువు కేవలం వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. కార్పొరేట్ కనెక్షన్లకు సంబంధించిన ఎంఎన్‌పీ గడువు సమయాలలో మార్పేమీ లేదు. ఇక మొబైల్ నంబర్ పోర్టబులిటీ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు జారీ అయ్యే యూనిక్ పోర్టింగ్ కోడ్(యూపీసీ) నాలుగు రోజులపాటు పనిచేస్తుంది. అయితే జమ్మూ కశ్మీర్, అస్సోం, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఈ యూపీసీ గడువు 30 రోజులపాటు ఉంటుంది.
ఏ నెట్‌వర్క్ యూజర్లయినా సరే.. ఎంఎన్‌పీకి దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్ ఆపరేటర్ వద్ద 90 రోజులకు మించి సేవలు పొందుతూ ఉండాలి. అలాగే ప్రస్తుత ఆపరేటర్ వద్ద ఎలాంటి బకాయిలు ఉండరాదు. బిల్లుకు సంబంధించి ఏదైనా బకాయి ఉన్నప్పుడు యూపీసీ సాధ్యపడదు. అలాగే సబ్‌స్క్రిప్షన్ అగ్రిమెంట్‌కు సంబంధించిన షరతులన్నీ నెరవేర్చి ఉండాలి.
15 వరకు ఎంఎన్‌పీ సేవలు నిలిపివేత...
మొబైల్ నంబర్ పోర్టబులిటీ ప్రక్రియలో మార్పులు చేస్తున్నందువల్ల పాత పద్ధతిని ఈ నెల 10 నుంచి 15 వరకు.. ఐదు రోజులపాటు నిలిపివేశారు. ఈ తేదీకి ముందుగా ఎంఎన్‌పీకి దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈనెల 16 నుంచి ఎంఎన్‌పీ కొత్త ప్రక్రియ మొదలవుతుంది.


Click it and Unblock the Notifications