దేశంలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా.. ప్రధాని మోదీ పరోక్షంగా హింట్ ఇచ్చారా.. అసలేం జరుగుతోంది..
New Lockdown Coming? హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో ఆయన చేసిన విజ్ఞప్తులు ఒక రకమైన 'ఆర్థిక క్రమశిక్షణ'కు పిలుపునిచ్చాయి. ఈ ప్రసంగంలోని ముఖ్యాంశాలు దాని వెనుక ఉన్న విశ్లేషణాత్మక కోణాన్ని ఓ సారి చూద్దాం.
ప్రపంచం మరోసారి అనిశ్చితి కోరల్లో చిక్కుకుంది. పశ్చిమ ఆసియాలో మండుతున్న యుద్ధ సెగలు భారతదేశ వంటగది వరకు చేరుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వంటి కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఉద్రిక్తతలు పెరగడంతో, ముడి చమురు, సహజ వాయువు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో, సామాన్య ప్రజలపై భారాన్ని తగ్గించి, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్‌లో ప్రజలకు ఒక సరికొత్త 'స్వచ్ఛంద కార్యచరణ'ను ప్రతిపాదించారు.

ప్రధాని తన ప్రసంగంలో కోవిడ్-19 కాలాన్ని ప్రస్తావించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో మనం అనివార్యంగా పాటించిన 'వర్క్ ఫ్రమ్ హోమ్' (WFH), ఆన్‌లైన్ సమావేశాల పద్ధతిని ఇప్పుడు ఒక ఆర్థిక వ్యూహంగా మార్చుకోవాలని ఆయన సూచించారు.
ఎందుకంటే ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే ప్రయాణాలను తగ్గిస్తే, దేశవ్యాప్తంగా లక్షల లీటర్ల ఇంధనం ఆదా అవుతుంది. ఇది కేవలం పౌరుల జేబుకే కాకుండా, దేశ విదేశీ మారక నిల్వలపై (Forex Reserves) ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో ప్రాణత్యాగం చేయడమే కాదని, సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా మలచుకోవడమేనని మోదీ ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు.
1. వ్యక్తిగత వాహనాలకు బదులుగా మెట్రో, బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థలను వాడటం.
2. కార్-పూలింగ్ అలవాటు చేసుకోవడం.
3. సరుకుల రవాణా కోసం రోడ్ల కంటే రైల్వేలను ఎక్కువగా వినియోగించుకోవడం.
ఈ చర్యలన్నీ అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరల పెనుగులాట నుంచి భారత్‌ను రక్షిస్తాయని ఆయన భావిస్తున్నారు.

భారతీయులకు బంగారానికి ఉన్న విడదీయరాని బంధాన్ని ప్రస్తావిస్తూనే, ఒక విప్లవాత్మక విజ్ఞప్తి చేశారు ప్రధాని. కనీసం ఏడాది పాటు పెళ్లిళ్ల కోసం అనవసరమైన బంగారం కొనుగోళ్లు ఆపాలని కోరారు. దీనిని మనం చూసినట్లయితే చమురు తర్వాత భారత్ అత్యధికంగా విదేశీ మారకాన్ని వెచ్చిస్తోంది బంగారం దిగుమతుల కోసమే. యుద్ధ సమయంలో చమురు కోసం డాలర్లు అత్యవసరమైన తరుణంలో, బంగారం కొనుగోళ్లు తగ్గించడం వల్ల రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవచ్చు. అలాగే, విదేశీ పర్యటనల కంటే దేశీయ పర్యాటకాన్ని (Domestic Tourism) ప్రోత్సహించాలని కోరారు. మేక్ ఇన్ ఇండియా వైపు అడుగులు వేయాలని మోదీ కోరారు.
ఇక ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి'లో ఇరాన్, అమెరికాల మధ్య నెలకొన్న గొడవలు సరఫరా గొలుసును దెబ్బతీశాయి. ఇరాన్ విధిస్తున్న సుంకాలు, అమెరికా హెచ్చరికల మధ్య సరకు రవాణా నౌకలు ఆగిపోవడంతో ధరలు పెరిగాయి. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం ఈ మార్గంపైనే ఎక్కువగా ఆధారపడి ఉండటం వల్ల, మనపై ఆ ప్రభావం నేరుగా పడుతోంది.
ప్రధాని మోదీ వ్యాఖ్యలు విన్న చాలామందిలో "మళ్ళీ లాక్‌డౌన్ వస్తుందా?" అనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రభుత్వం ఎక్కడా అధికారిక ఆంక్షలను విధించలేదు. ఇది ఆర్థిక నియంత్రణే తప్ప భౌతిక నియంత్రణ కాదు. ప్రభుత్వానికి ప్రజల సహకారం ఎంత అవసరమో చెప్పడమే మోదీ ప్రసంగం ఉద్దేశ్యం.
ప్రధాని మోదీ ప్రసంగం ఒక హెచ్చరిక విన్నపం కలయికగా చూడవచ్చు. యుద్ధాలు సృష్టించే ఆర్థిక విపత్తుల నుంచి బయటపడాలంటే, ప్రజలు తమ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విలాసాల కంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని చాటిచెప్పడమే ఈ ప్రసంగం సారాంశంగా చూడవచ్చు.


Click it and Unblock the Notifications
