భారతదేశంలో కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి రావడంతో.. దేశంలోని ఐటీ, ఐటీ ఆధారిత సేవల సంస్థలు పెద్ద ఎత్తున వ్యయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా వేతన నిర్మాణం, ఆరోగ్య పరిరక్షణ ఖర్చులు, సమ్మతి (కాంప్లైయెన్స్) సంబంధిత అవసరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అధికారిక రంగంలో పెద్ద యజమానులుగా ఉన్న ఐటీ పరిశ్రమకు ఇది ఒక కీలక మార్పు అనిపిస్తోంది.
ప్రధాన మార్పుల్లో అత్యంత ప్రభావితం చేసేది వేతనాల విషయంలో జరిగిన సవరణ. ఇప్పటి వరకు గణనీయ సంఖ్యలో సంస్థలు తమ ఉద్యోగుల ప్రాథమిక వేతనాన్ని (Basic Pay) తక్కువగా ఉంచి, అలవెన్సుల రూపంలో అధిక భాగాన్ని చెల్లించేవి. ఈ విధానం వల్ల ప్రావిడెంట్ ఫండ్ (PF), గ్రాట్యుటీ, సెలవు నగదు, ఇతర చట్టబద్ధ ఉద్యోగ ప్రయోజనాలపై కంపెనీల ఖర్చులు తక్కువగా ఉండేవి.

అయితే కొత్త కార్మిక చట్టాల ప్రకారం.. ఉద్యోగికి ఇచ్చే మొత్తం పరిహారం (CTC)లో కనీసం 50 శాతం ప్రాథమిక జీతం తప్పనిసరిగా ఉండాలి. ఈ ఒక్క మార్పు వల్లే కంపెనీల PF వాటాలు, గ్రాట్యుటీ లైబిలిటీలు, ఇతర ప్రయోజనాలపై ఖర్చులు గణనీయంగా పెరగనున్నాయి. ఉదాహరణకు..ఒక ఉద్యోగి యొక్క CTCలో ప్రాథమిక వేతనం 30 శాతం నుంచి 50 శాతానికి పెరిగితే కంపెనీ PF కాంట్రిబ్యూషన్ నేరుగా 30 నుంచి 40 శాతం వరకూ పెరిగే అవకాశం ఉంది.
ఇక ఆరోగ్య విభాగంలో కూడా కొత్త నిబంధనలు భారంగా మారనున్నాయి. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఉద్యోగికి వార్షిక ఆరోగ్య పరీక్ష తప్పనిసరి. దీనికి ఉద్యోగి ఒక్కొక్కరికి సంవత్సరానికి సుమారు రూ.1,000 నుండి రూ. 2,500 వరకు ఖర్చు అవుతుంది. పెద్దగా హెడ్కౌంట్ ఉన్న ఐటీ కంపెనీలకు ఇది లక్షల్లో, కొన్ని సందర్భాల్లో కోట్ల రూపాయల్లో అదనపు వ్యయంగా మారవచ్చు. సమ్మతి (compliance) విషయానికొస్తే.. కొత్త కార్మిక కోడ్ల అమలుతో డాక్యుమెంటేషన్, ఆడిటింగ్, రికార్డు నిర్వహణ, రిపోర్టింగ్ బాధ్యతలు మరింత కఠినతరం అవుతాయి. అంటే కంపెనీలు అదనపు HR, కాంప్లైయెన్స్ సిబ్బందిని నియమించాల్సి వస్తుందితద్వారా మానవ వనరుల ఖర్చులు కూడా పెరుగుతాయి.
బిజినెస్ స్టాండర్డ్ అంచనా ప్రకారం.. ఈ మార్పుల సమిష్టి ప్రభావం ఐటీ, ఐటీఈఎస్ రంగాలలో మొత్తం వేతన వినియోగ ఖర్చుల్లో 5 శాతం నుండి 10 శాతం వరకూ పెరుగుదలను కలిగించవచ్చు. ఇప్పటికే తగ్గుతున్న గ్లోబల్ డిమాండ్, ప్రాజెక్టుల ఆలస్యం, నియామకాల మందగమనం మధ్య ఈ అదనపు వ్యయం కంపెనీల లాభదాయకతపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.
కొత్త కార్మిక చట్టాలు ఉద్యోగులకు మరింత భద్రత, ప్రయోజనాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చినప్పటికీ, కంపెనీలకు ఇది రాబోయే కాలంలో వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ అవసరాన్ని చేస్తుంది. భారీ వర్క్‌ఫోర్స్ ఉన్న పెద్ద IT కంపెనీలు దీన్ని తట్టుకోగలిగినా.. చిన్న, మధ్యస్థ స్థాయి IT సంస్థలకు ఇది ఆర్థికంగా గట్టి పరీక్షగా మారవచ్చు.
రాబోయే నెలల్లో సంస్థలు తమ జీత నిర్మాణాలను తిరిగి పునర్వ్యవస్థీకరించడం, ప్రయోజన పథకాలను సర్దుబాటు చేయడం,కొన్ని సందర్భాల్లో నియామకాల వేగాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకునే అవకాశముంది.


Click it and Unblock the Notifications