రైలు టికెట్ బుక్ చేసే వారికి కీలక అలర్ట్.. జూలై 15 నుంచి టికెట్ బుకింగ్‌లో పూర్తిగా మార్పులు..
రైల్వే ప్రయాణికులకు మరింత సులభమైన, వేగవంతమైన సేవలందించేందుకు భారతీయ రైల్వే శాఖ సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టబోతోంది. ఎంతో కాలంగా ప్రయాణికులు ఎదురుచూస్తున్న సరికొత్త ఐఆర్‌సిటిసి (IRCTC) వెబ్‌సైట్‌ను వచ్చే నెల జూలై 15వ తేదీ లోపు ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం అధికారికంగా ప్రకటించారు.
జైపూర్‌లోని మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MNIT)లో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఆయన ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. ఈ కొత్త వెబ్‌సైట్ ద్వారా వినియోగదారుల డిజిటల్ అనుభవాన్ని పూర్తిగా మార్చేయడమే కాకుండా, మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ఆధునికమైన, వేగవంతమైన ఫంక్షన్లను ప్రవేశపెట్టబోతున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మార్పుగా భావిస్తున్న ఈ ప్రాజెక్ట్ వెనుక దాదాపు 40 ఏళ్ల నాటి ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) స్థానంలో సరికొత్త వ్యవస్థను తీసుకురావాలనే బలమైన సంకల్పం ఉంది. ఈ ఏడాది మే నెలలోనే రైల్వే మంత్రిత్వ శాఖ దీనిపై ముందస్తు ప్రకటన చేసింది. రాబోయే ఆగస్టు నాటికి కాలం చెల్లిన పాత సాంకేతికతను పక్కనబెట్టి, అత్యాధునిక ప్లాట్‌ఫారమ్‌ను అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. నిజానికి భారతీయ రైల్వే ఇంటర్నెట్ టికెట్ బుకింగ్ సేవలు 2002లో ప్రారంభం కాగా, నేడు దేశంలో బుక్ అవుతున్న మొత్తం రైలు టికెట్లలో దాదాపు 88 శాతం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారానే జరుగుతున్నాయి. ఇంతటి భారీ డిమాండ్ ఉన్న తరుణంలో పాత వ్యవస్థపై భారం పడకుండా ఉండటానికి ఈ సమగ్ర పునరుద్ధరణ అత్యవసరంగా మారింది.
ఈ నూతన పి.ఆర్.ఎస్ (PRS) వ్యవస్థ రాకతో టికెట్ బుకింగ్ సామర్థ్యం ఊహించని రీతిలో పెరగనుంది. గత ఏడాది రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం నిమిషానికి కేవలం 32,000 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుండగా, కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఆ సంఖ్య ఏకంగా 1.5 లక్షలకు పైగా పెరుగుతుంది. అంటే బుకింగ్ వేగం సుమారు ఐదు రెట్లు పెరుగుతుందన్నమాట. కేవలం బుకింగ్ మాత్రమే కాకుండా, ప్యాసింజర్లు రైళ్ల సమాచారం తెలుసుకునే విచారణ (Enquiry) సామర్థ్యం కూడా పది రెట్లు పెరగనుంది. నిమిషానికి 4 లక్షలుగా ఉన్న విచారణల సామర్థ్యాన్ని 40 లక్షలకు పైగా పెంచడం ద్వారా తత్కాల్ సమయంలో సర్వర్లు డౌన్ అయ్యే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
వినియోగదారుల సౌకర్యార్థం ఈ కొత్త ప్లాట్‌ఫారమ్‌ను బహుభాషా, వినియోగదారు-స్నేహపూర్వక (User-friendly) ఇంటర్‌ఫేస్‌తో రూపొందించారు. దీనివల్ల ప్రయాణికులు తమకు నచ్చిన సీటును సులభంగా ఎంచుకోవడమే కాకుండా, తక్కువ ధరలు ఉన్న రోజులను చూపే 'ఛార్జీల క్యాలెండర్'ను కూడా వీక్షించవచ్చు. ముఖ్యంగా దివ్యాంగులు, విద్యార్థులు, రోగుల కోసం ప్రత్యేక సదుపాయాలను ఇందులో పొందుపరిచారు.
వీటన్నింటికీ అదనంగా, గత ఏడాది రైల్వే శాఖ ప్రవేశపెట్టిన 'రైల్ వన్' అనే సూపర్ మొబైల్ అప్లికేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో పనిచేస్తూ ప్రయాణికులకు ఎంతగానో తోడ్పడుతోంది. ఒకవేళ టికెట్ వెయిట్‌లిస్ట్‌లో ఉంటే, అది కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయో ఈ యాప్ ముందే కచ్చితంగా అంచనా వేసి చెబుతుంది. ఈ విధంగా సరికొత్త వెబ్‌సైట్ , ఆధునిక పీఆర్ఎస్ వ్యవస్థల కలయికతో భారతీయ రైల్వే ప్రయాణ రంగంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications
