ప్రైవేట్ , ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. గతంలో గ్రాట్యుటీ పొందాలంటే ఒకే సంస్థలో కనీసం ఐదేళ్ల పాటు నిరంతరంగా పనిచేయాలనే నిబంధన ఉండేది. అయితే, కొత్త లేబర్ కోడ్ (New Labour Codes) అమలులోకి రావడంతో ఈ గ్రాట్యుటీ రూల్స్ (Gratuity rules) లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు కేవలం ఒక్క ఏడాది సర్వీస్ పూర్తి చేసినా గ్రాట్యుటీ పొందే అవకాశం కల్పించారు. అయితే, ఇందులో ఒక ముఖ్యమైన 'క్యాచ్' ఉంది, అది ఏంటో ప్రతి ఉద్యోగి తెలుసుకోవాలి.

ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?
కొత్త లేబర్ కోడ్ ప్రకారం, ఈ గ్రాట్యుటీ నిబంధనలు నవంబర్ 21, 2025 నుండి అమలులోకి వచ్చాయి. అంటే ఈ తేదీ తర్వాత విధుల్లో చేరిన వారికి లేదా అప్పటి నుంచి అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం పనిచేసే వారికి ఈ కొత్త బెనిఫిట్స్ వర్తిస్తాయి. దీనివల్ల ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో లేదా ఉద్యోగం వదిలేటప్పుడు వచ్చే లంప్ సమ్ (Lump sum) మొత్తం భారీగా పెరిగే అవకాశం ఉంది.
ఏడాదికే గ్రాట్యుటీ.. ఎవరికి వర్తిస్తుంది?
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ ఒక్క ఏడాది నిబంధన అందరికీ వర్తించదు. కొత్త Gratuity rules ప్రకారం, కేవలం 'ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయీస్' (Fixed-term employees) , కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రమే ఏడాది సర్వీస్ తర్వాత గ్రాట్యుటీ లభిస్తుంది.
- రెగ్యులర్ ఉద్యోగులు: శాశ్వత ప్రాతిపదికన పనిచేసే సాధారణ ఉద్యోగులకు మాత్రం పాత నిబంధన ప్రకారమే ఐదేళ్ల సర్వీస్ అవసరం. (అయితే మరణం లేదా అంగవైకల్యం సంభవించినప్పుడు ఈ పరిమితి ఉండదు).
- ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులు: ఒక సంవత్సరం లేదా రెండేళ్ల కాంట్రాక్ట్ మీద చేరిన వారికి, వారు పనిచేసిన కాలానికి అనుగుణంగా (Pro-rata basis) గ్రాట్యుటీ చెల్లిస్తారు.
మీ చేతికి వచ్చే డబ్బు పెరుగుతుందా?
కొత్త రూల్స్ ప్రకారం, గ్రాట్యుటీ లెక్కించే విధానంలో కూడా మార్పు వచ్చింది. ఇకపై ఉద్యోగి యొక్క బేసిక్ శాలరీ, డియర్నెస్ అలవెన్స్ (DA) , రిటైనింగ్ అలవెన్స్ అన్నీ కలిపి కంపెనీ ఇచ్చే మొత్తం సిటిసి (CTC)లో కనీసం 50 శాతం ఉండాలి. గతంలో బేసిక్ పే తక్కువగా ఉంచి, అలవెన్సులు ఎక్కువగా ఇచ్చేవారు. ఇప్పుడు బేసిక్ పే పెరగడం వల్ల, గ్రాట్యుటీ కూడా దాదాపు 60 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఉదాహరణకు, గతంలో మీ బేసిక్ పే సిటిసిలో 30 శాతంగా ఉంటే, ఇప్పుడు అది 50 శాతానికి పెరుగుతుంది. గ్రాట్యుటీని బేసిక్ పే మీద లెక్కిస్తారు కాబట్టి, సహజంగానే మీకు వచ్చే గ్రాట్యుటీ మొత్తం కూడా భారీగా పెరుగుతుంది. ఇది ఉద్యోగుల దీర్ఘకాలిక పొదుపుకు ఎంతో మేలు చేసే అంశం.
మొత్తానికి, కొత్త లేబర్ కోడ్ వల్ల ఉద్యోగ భద్రతతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వారికి ఈ నిబంధన ఒక పెద్ద ఊరట అని చెప్పవచ్చు. మీరు పనిచేస్తున్న సంస్థలో ఈ కొత్త నిబంధనలు ఎలా అమలు చేస్తున్నారో ఒకసారి హెచ్ఆర్ (HR) విభాగంతో మాట్లాడి క్లారిటీ తీసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications