RBI News: గత కొంతకాలంగా చెల్లింపుల విధానం పలు మార్పులకు లోనవుతోంది. క్యూ లైన్లలో బ్యాంకుల ముందు గంటల తరబడి నిలబడే పరిస్థితి నుంచి అరచేతిలో, నడిరోడ్డుపై, క్షణాల వ్యవధిలోనే పేమెంట్స్ చేసే స్థాయికి చేరుకున్నాం. అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అభివృద్ది దిశగా మరింత ముందుకు సాగేందుకు కొత్త విధానాలు మార్కెట్లోకి రానున్నాయి.
ప్రస్తుతం UPI పేమెంట్స్ చేసే ముందు PIN ఎంటర్ చేయడం తప్పనిసరి. అయితే రానున్న రోజుల్లు ఈ విధానానికి చెక్ పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ యోచిస్తోంది. దాని స్థానంలో బయోమెట్రిక్ ప్రామాణీకరణను ప్రవేశపెట్టాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భావిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే అనేక స్టార్టప్‌లతో చర్చలు జరుపుతన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ప్రతిపాదిత కొత్త సిస్టమ్‌లో 4 లేదా 6 అంకెల UPI పిన్‌కు బదులుగా అండ్రాయిడ్ పరికరాల్లో వేలిముద్రలు, ఐఫోన్లలో ఫేస్ IDని వినియోగించేందుకు అనుమతించాలని NPCI చూస్తోందని తెలుస్తోంది. డిజిటల్ లావాదేవీల విషయంలో అదనపు అథెంటికేషన్ సిస్టమ్ అవసరమని RBI ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రతిపాదించిన వారం తర్వాత ఈ వార్త వెలుగులోకి వచ్చింది. బయోమెట్రిక్, పిన్‌లకు మించిన ఎంపికలను అన్వేషించాలని సెంట్రల్ బ్యాంక్ సూచించింది.
ఈ విషయంలో సంభావ్య ఆర్థిక మరియు చట్టపరమైన అంశాలపై NPCI దృష్టి సారించినట్లు సమాచారం. ప్రారంభంలో PINతో పాటు బయోమెట్రిక్ ప్రామాణీకరణను అనుమతించే అవకాశం ఉంది. ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లలో అంతర్నిర్మిత బయోమెట్రిక్ సామర్థ్యాలను ఉపయోగించడం ద్వారా, UPI లావాదేవీల భద్రత మరియు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచాలని భావిస్తోంది. త్వరలోనే దీనిపై RBI లేదా NPCI నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications