Zomato News: కోపైలెట్ ప్రోగ్రామ్‌లో జొమాటో కీలక స్టెప్.. నెట్టింట ప్రశంసల వర్షం
Zomato Copilot: కార్పొరేట్ కంపెనీల్లోని హై లెవల్ మేనేజ్‌మెంట్ కింది స్థాయిలోని ఉద్యోగులను ఎదగనివ్వరని, తొక్కేస్తూ ఉంటారని చాలా మంది భావిస్తుంటారు. అయితే కొన్ని సంస్థలు మాత్రం తమ సిబ్బంది ఎదుగులకు అవకాశం ఇస్తూ, తమతో పాటు వారు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చర్యలు తీసుకుంటాయి. తాజాగా జొమాటో తీసుకున్న ఓ నిర్ణయం ఈ కోవలోకి చెందినదే.
జొమాటో CEO దీపిందర్ గోయల్ తన డెలివరీ భాగస్వాములలో నలుగురుని ప్రొడక్ట్ మేనేజర్లుగా ప్రమోట్ చేశారు. ఈ అప్‌డేట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పంచుకున్నారు. ఈ ప్రమోషన్‌లు తమ 'జొమాటో కోపైలట్' చొరవలో భాగమని ప్రకటించారు. పోస్ట్‌తో పాటు గోయల్ రెండు ఫోటోలను కూడా షేర్ చేశారు. మొదటి చిత్రంలో ఉద్యోగులు ఎరుపు రంగు జొమాటో టీ-షర్టులు ధరించి కనిపించారు. రెండవదానిలో వారు తమ సంభాషణలో నిమగ్నమై ఉన్నారు.

'వీరే మా కోపైలట్‌లు అతుల్, అభిజిత్, రాజా మరియు హర్షిత్. ఈ కార్యక్రమంలో భాగంగా నలుగురు డెలివరీ భాగస్వాములు మా గురుగ్రామ్ HQలో ప్రోడక్ట్ మేనేజర్‌లుగా పని చేస్తున్నారు. 'జొమాటో కోపైలెట్' గత నెలలో ప్రారంభించబడింది. దీనిద్వారా డెలివరీ భాగస్వాములకు మా ఎకోసిస్టమ్‌లో మరింత కీలక పాత్ర పోషించే అవకాశం కల్పిస్తాము. మా సిస్టమ్‌లను మెరుగుపరచడంలో వారు సహాయపడతారు. వారి అభిప్రాయం, సూచనలు మరియు ఇన్‌పుట్‌ల నుంచి చాలా నేర్చుకున్నాము. వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తాము' అని తెలిపారు.
టేబుల్ వద్ద సీటు ఇస్తే ప్రతి రూపంలోనూ వైవిధ్యంతో కూడిన ఆవిష్కరణలను పెంపొందించవచ్చని భావిస్తున్నట్లు జొమాటో బాస్ చెప్పుకొచ్చారు. వ్యాపార నిర్వహణలో కొత్త ఆలోచనలను రూపొందించవచ్చని నమ్ముతున్నట్లు చెప్పారు. అనవసరమైన అహం లేదా గర్వం లేకుండా ఎల్లప్పుడూ కస్టమర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు ప్రయత్నిస్తుంటామన్నారు.
గోయల్ పోస్ట్‌పై సోషల్ మీడియా యూజర్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అతుల్, అభిజిత్, రాజా మరియు హర్షిత్ వంటి డెలివరీ భాగస్వాములు ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ పాత్రలలోకి మారడం స్ఫూర్తిదాయకమన్నారు. వారి ఆలోచనలు ఖచ్చితంగా కొత్త ఆవిష్కరణలను ప్రేరేపిస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. జొమాటో తీసుకుంటున్న ఈ తరహా వైవిధ్యభరిత మార్పుల పట్ల సంతోషిస్తున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications