ecommerce news: దేశంలో ఒకప్పుడు మంచి జోరు కనబరిచిన ఇ-కామర్స్ ఇండస్ట్రీ క్రమంగా మసకబారుతోంది. క్విక్ కామర్స్ విభాగం దూకుడు ఒక కారణమైతే, ఆ రంగంలోని కంపెనీల స్వయం కృతాపరాధం మరో రీజన్‌గా చెప్పవచ్చు. వినియోగదారులను ఆకర్షించేందుకు పలు ఆఫర్స్, డెలివరీ ఛార్జీల్లో రాయితీ ఇచ్చిన సంస్థలు.. ఇప్పుడు కనీసం కస్టమర్ల ఫిర్యాదులను కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ముంబైకి చెందిన అహ్సన్ అనే వ్యక్తికి ఎదురైన వింత అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసిన చెప్పులకు సంబంధించి ఆరేళ్ల తర్వాత సదరు సంస్థ కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వచ్చినట్లు చెప్పారు. మొదటగా తాను కొంత కంగారు పడినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో 2018లో పెట్టిన ఆర్డర్ స్క్రీన్ షాట్‌ను తన పోస్టుకు జతచేశారు.

చెప్పులు ఆర్డర్ చేసి ఆరేళ్లు గడుస్తున్నా ఇంకా అవి తనకు చేరలేదని అహ్సన్ తెలిపారు. ఎప్పుడు చూసినా తన ఆర్డర్ అదే రోజు డెలివరీ కానున్నట్లు చూపించేందని పేర్కొన్నారు. అయితే ఫ్లిప్‌కార్ట్ నుంచి ఎవరూ ఇప్పటి వరకు స్పందించలేదని కానీ ఇప్పడు అకస్మాత్తుగా కాల్ వచ్చినట్లు వివరించారు. ఆర్డర్‌తో సమస్య ఏమిటో వివరించాలని వారు అడిగినట్లు చెప్పారు.
లాజిస్టిక్స్ టీమ్ నుంచి ఎటువంటి కాల్ రాలేదా అని కస్టమర్ కేర్ ప్రతినిధి తనను అడిగినట్లు ఆ ముంబై వ్యక్తి వెల్లడించారు. కలిగిన అసౌకర్యానికి మమ్మల్ని క్షమించండి సార్ అంటూ కాల్ ముగించినట్లు తెలిపారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ చేయడంతో తనకు ఇబ్బంది కలగలేదని చెప్పారు. అయితే ఆర్డర్‌ను రద్దు చేయడానికి యాప్‌లో ఎలాంటి ఆప్షన్ లేదన్నారు.
ఈ పోస్టును చూసి పలువురు నెటిజన్లు ఫ్లిప్‌కార్ట్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. తమకు కూడా ఇదే తరహా అనుభవాలు ఎదురయ్యాయని ఏకరువు పెడుతున్నారు. భారత్‌లో తప్ప మరే దేశంలోనూ ఇలా జరగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications