రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నరు శక్తికాంత దాస్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పలువురు ఆయనకు శుభాకాంక్షలు చెబుతుండటంతో ట్విట్టర్ దద్దరిల్లిపోతోంది. ఇంతకూ దీనికి కారణం ఏమిటంటే.. లండన్‌లో జరిగిన సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2023లో భాగంగా 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్'గా ఆయన ఎంపిక కావడమే. ప్రతి భారతీయుడూ గర్వించదగిన విషయం కావడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
క్లిష్టమైన సంస్కరణలను RBI గవర్నర్ సుస్థిరం చేశారని ఈవెంట్ నిర్వాహకులు కొనియాడారు. ప్రపంచంలోని ప్రముఖ చెల్లింపుల ఆవిష్కరణలను పర్యవేక్షించారని, వాటిని సమయానుగుణంగా చక్కగా రూపొందించి దేశాన్ని కష్ట సమయాల్లో ముందుండి నడిపించారని ప్రశంసించారు. 2018 నుంచి ఇప్పటి వరకు పలు ద్రవ్య నిర్ణయాలను అమలుచేసి, దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారన్నారు.

"ఒక ప్రధాన నాన్-బ్యాంకు సంస్థ పతనంతో మొదలై, కరోనావైరస్ మొదటి మరియు రెండవ వేవ్స్ వల్ల తీవ్రమైన సవాళ్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దాని నుంచి పూర్తిగా కోలుకోకుండానే 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ద్రవ్యోల్బణం ప్రభావం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటువంటి తీవ్ర పరిస్థితులకు సమర్థవంతంగా ఎదురు వెళ్తూ, ప్రపంచంలో మేటి ఆర్థిక వ్యవస్థగా భారత్ ను నిలపడాన్ని ఖచ్చితంగా ప్రశంసించాలి" అని నిర్వాహకులు పేర్కొన్నారు.
అవార్డు వార్త వెలువడిన తర్వాత నుంచి RBI గవర్నర్ శక్తికాంత దాస్ కు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. "భారతదేశానికి, భారతీయులందరికీ గర్వించదగిన క్షణం" అంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. చాలా కాలంగా వృద్ధికి ఆటంకంగా ఉన్న బ్యాంకింగ్ రంగం ఆయన హయాంలో క్రమంగా మెరుగుపడిందంటూ పోస్టులు పెడుతున్నారు. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని, ఆర్థిక పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించడంపై ట్వీట్స్ ద్వారా తమ అభిమానాన్ని చాటుకున్నారు.


Click it and Unblock the Notifications