IPO News: ఐపీవో రివర్స్ గేర్ లిస్టింగ్.. తలబాదుకుంటున్న ఇన్వెస్టర్స్, చివర్లో ట్విస్ట్..
Neopolitan Pizza And Foods IPO: ఈవారం ఐపీవో ఇన్వెస్టర్లకు పెద్ద నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి రెండేళ్లకు పైగా నిరంతరాయంగా కొనసాగిన ఐపీవో లాభాల ర్యాలీ ముగిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న అనేక ఎస్ఎమ్ఈ ఐపీవోలు డిస్కౌంటెడ్ లిస్టింగ్ నమోదు చేస్తూ బెట్టింగ్ వేసిన పెట్టుబడిదారులను షాక్ కి గురిచేస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నియోపాలిటన్ పిజ్జా అండ్ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన కంపెనీ షేర్లు నేడు బీఎస్ఈలో లిస్టింగ్ అయ్యాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్లు వాస్తవ ఇష్యూ ధర రూ.20 కంటే 4 శాతం డిస్కౌంట్ రేటు రూ.19.25 వద్ద జాబితా అయ్యింది. తక్కువ ధరతో ఎంట్రీ వల్ల ఇన్వెస్టర్లు కొంత నిరాశకు గురైనప్పటికీ తర్వాత కొనుగోళ్లు ఊపందుకోవటంతో 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. దీంతో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.20.21 వద్ద ఇంట్రాడేలో కొనసాగుతోంది.

తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.12 కోట్లను సమీకరించింది. పెట్టుబడిదారుల సబ్‌స్క్రిప్షన్ కోసం ఐపీవో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4 వరకు అందుబాటులో ఉంచబడింది. అలాగే లాట్ పరిమాణాన్ని 6000 షేర్లుగా ఉంచటంతో ఇన్వెస్టర్లు కనీసం రూ.1.20 లక్షలు ఇన్వెస్టర్లు వెచ్చించారు. కంపెనీ మార్కెట్లో ఇన్వెస్టర్లకు తాజాగా ఐపీవోలో 6 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించింది.
ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయంలో మెజారిటీ భాగాన్ని 16 కొత్త క్విక్ సర్వీస్ రెస్టారెంట్లను తెరవడానికి ఉపయోగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో డబ్బును కంపెనీ స్టోర్ల ఏర్పాటుకు సెక్యూరిటీ డిపాజిట్లు, అడ్వాన్స్ అద్దె చెల్లించడానికి ఉపయోగించబడుతుంది. అలాగే వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం కొంత వినియోగించనుంది.
నియోపాలిటన్ పిజ్జా అండ్ ఫుడ్స్ కంపెనీ 2011లో స్థాపించబడింది. కంపెనీ ప్రస్తుతం రెండు కేటగిరీల కింద రెస్టారెంట్ కార్యకలాపాలు, వ్యవసాయ వస్తువుల వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ సొంతంగా రెస్టారెంట్లను నిర్వహించటంతో పాటు ఫ్రాంచైజ్ మోడల్ కింద కూడా స్టోర్లను ఏర్పాటు చేస్తోంది. అలాగే తాజా పదార్థాలతో తయారు చేసిన నియాపోలిటన్-శైలి పిజ్జాను విక్రయించటంతో ప్రసిద్ధి చెందింది. కంపెనీ ప్రస్తుతం గ్లూటెన్-ఫ్రీ, శాఖాహార ఎంపికలతో సహా పలు రకాల టాపింగ్స్‌ను పిజ్జా లవర్స్ కి అందిస్తోంది. ఐఎస్ఓ సర్టిఫికేట్ అందుకున్న కంపెనీ వివిధ రకాల సూప్‌లు, సలాడ్‌లు, బ్రెడ్, పాస్తా, చేతితో విసిరిన పిజ్జా, డెజర్ట్‌లను అందిస్తుంది. ఇదే క్రమంలో గోధుమలు, బియ్యం, టామోటాలు, ఉల్లి వంటి వ్యాపార ఉత్పత్తులను విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications