Financial Crisis: శ్రీలంకలో కొనసాగుతున్న సంక్షోభం మధ్య.. లక్షల మంది ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక్క ఉద్యోగం కోసం కూడా ఇబ్బందులు పడుతున్నారు. అనేక కష్టాల మధ్య ఆర్థిక సమస్య ఇప్పుడు అతిపెద్ద రాజకీయ సమస్యగా మారింది. అక్కడ ఏ సమయంలో ఏం జరుగుతుందో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మాంద్యం భయాలు..
ప్రస్తుతం శ్రీలంక వంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరిన్ని దేశాల్లో కొనసాగుతున్నాయి. వాటిలో ముఖ్యంగా మన పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, మాల్దీవులూ ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అధిపతి అన్నారు. ఇదిలా ఉండగా చైనా పరిస్థితి కూడా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. చైనాలోని బ్యాంకింగ్ వ్యవస్థ, రియల్ ఎస్టేట్ కుప్పకూలడం వంటి కారణంగా మాంద్యం సంభవించే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచానికి కరోనా మహమ్మారిని అందించిన చైనా ఈ సారి ఆర్థిక మహమ్మారిని ఇస్తుందా అనే భయాలు వ్యక్తమవుతున్నాయి.

పాకిస్థాన్..
శ్రీలంకలాగానే పాకిస్థాన్ కూడా ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చైనా అప్పుల ఊబిలో చిక్కుకున్న దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. పాకిస్థాన్ కూడా ఇటీవల ఇంధన సబ్సిడీని తగ్గించింది. దీంతో ఇంధన ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా ధరలు పెరిగి సామాన్యులకు భారంగా మారాయి.

కొండంత అప్పుల్లో పాకిస్థాన్..
పాకిస్థాన్ వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు క్షీణించాయి. దీంతో రుణాల సమస్య గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం పాకిస్ఠాన్ తన ఆదాయంలో దాదాపు 40% అప్పులపై వడ్డీగా చెల్లిస్తోందని డేటా ప్రకారం తెలుస్తోంది. ఇదే సమయంలో పాకిస్థాన్ కరెన్సీ విలువ కూడా క్షీణిస్తూనే ఉంది.

మాల్దీవులు..
శ్రీలంక లాగానే మాల్దీవులు ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. అయితే.. కరోనా కారణంగా పర్యాటక రంగం పూర్తిగా స్తంభించిపోయింది. ఇంతలో.. మాల్దీవుల్లో అభివృద్ది తీవ్రంగా దెబ్బతింది. గత సంవత్సరం.. 33% కంటే ఎక్కువ క్షీణతను చూసింది. ఈ కాలంలో నిరుద్యోగ రేటు కూడా ఆందోళనకరంగా పెరిగిందని తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

అప్పుల్లో పర్యాటక దేశం..
ఇటీవలి సంవత్సరాల్లో మాల్దీవుల ప్రజారుణం గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం GDPలో అప్పులు 100% పైగా పెరిగాయి. మొత్తం ఆదాయంలో ఎక్కువ భాగం వడ్డీ చెల్లింపులకే వెళుతోంది. దాని రుణ నిష్పత్తి దాని GDPలో 78% పైగా పెరిగింది.

బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్‌లో ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠా స్థాయి అయిన 7.42 శాతానికి చేరుకుంది. అదనంగా.. అనవసరమైన దిగుమతులను అరికట్టడానికి, విదేశీ పెట్టుబడులను పెంచడానికి, క్షీణిస్తున్న నిల్వల అడ్డుకునేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని IMF సిఫార్సు చేసింది.

పెరుగుతూనే ఉన్న బంగ్లాదేశ్ రుణం..
బంగ్లాదేశ్ రుణ నిష్పత్తి కూడా 2002 నుంచి 2020 వరకు నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇది మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గణాంకాల ప్రకారం దాని అప్పులు GDPలో 22% నికి చేరుకున్నాయి.

సంస్కరణలు అవసరం..
మొత్తంమీద పైన దేశాల ప్రభుత్వాలు వీలైనంత త్వరగా సంస్కరణలు చేపట్టాలి. వృద్ధిని పునరుద్ధరించాలి. ముఖ్యంగా విదేశీ వ్యయాన్ని పెంచాలి. అవసరమైన ఆహార ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు, ఇంధన దిగుమతి, క్రెడిట్ సమస్య, వృద్ధిని ప్రోత్సహించడానికి నగదు ప్రవాహాన్ని ప్రోత్సహించడం వంటి అనేక అంశాలు సూచించబడ్డాయి.


Click it and Unblock the Notifications