వాటిపై దృష్టి సారించండి: ఆర్బీఐ, ప్రభుత్వానికి రఘురాం రాజన్ సూచనలు
రేటింగ్ ఏజెన్సీలు ఏమనుకుంటున్నాయనే అంశాన్ని పాలకులు పక్కన పెట్టాలని, ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కాబట్టి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంపై దృష్టి సారించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సూచించారు. కరోనా తర్వాత సాధారణస్థితికి తిరిగి పుంజుకుంటామని, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని పాలకులు దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు విశ్వాసం కలిగించాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన గ్లోబల్ మార్కెట్ ఫోరంలో మాట్లాడారు.

బంతి ప్రభుత్వం కోర్టులో
ఆర్బీఐ, ప్రభుత్వం పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నాయని, అయితే ఆర్థిక వ్యవస్థకు మరింతగా చేయాల్సిన బంతి ప్రభుత్వం కోర్టులో ఉందని రాజన్ అన్నారు. అయితే రుణాలు ఒత్తిడికి గురైన రంగాలు, సంస్థల వరకు చేరుతుందా అనే దానిపై దృష్టి సారించాలని సూచించారు. ప్యాకేజీ వంటి అంశాల గురించి మాట్లాడుతూ.. మరింతగా చేయాల్సి ఉందని, అలాగే ప్రాధాన్యతా అంశాలపై దృష్టి సారించాలన్నారు.

ఆర్థిక సామర్థ్యాలను పరిరక్షించాలి
క్రెడిట్ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలోకి వెళ్లిన ఏరియాలోకి వెళ్తుందా అనేది ముఖ్యమని, ఎందుకంటే దేశంలో వనరులు పరిమితమని, కాబట్టి దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కేసులు రోజురోజుకు పెరగడం, ఆర్థిక వ్యవస్థలు కుంచించుకుపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సామర్థ్యాలను పరిరక్షించాలని, అప్పుడే కరోనా అనంతరం కార్యకలాపాలు సహేతుకమైనరీతిలో ప్రారంభం కాగలవన్నారు.

మారటోరియంతో సంక్షోభం..
రఘురాం రాజన్ ప్రభుత్వానికి, ఆర్బీఐకు కీలక సూచనలు చేశారు. రేటింగ్ ఏజెన్సీలను పరిగణలోకి తీసుకుంటే పెద్ద నిర్ణయాలు తీసుకోలేమని, లోన్ మారటోరియానికి ముగింపు పలకడం, ఒత్తిడికి గురైన ప్రాంతాలకు రుణాలు వెళ్లడంపై దృష్టి సారించాలని, పాలకులు ఇన్వెస్టర్లకు నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. లోన్ మారటోరియం పొడిగిస్తే బ్యాంకులు సంక్షోభంలోకి వెళ్తాయని హెచ్చరించారు. మారటోరియంతో బ్యాంకులపై ఒత్తిడి పెరుగుతుందని, అలాగే రుణగ్రహీతలను తిరిగి చెల్లింపులు చేసే అలవాటును చేయడం కష్టమని గతంలోనే అభిప్రాయపడ్డారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి చివరి వారం నుండి దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ విధించారు. జూన్ నెల నుండి అన్-లాక్ ప్రారంభమైంది. అయితే కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు నగరాల్లో లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ఆశలను నిరోధిస్తోంది. పేద, చిన్న మధ్య తరహా వ్యాపారాలకు సాయం చేసేందుకు ప్రభుత్వం, ఆర్పీఐ పలు కార్యక్రమాలు చేపట్టింది. జీడీపీలో 10 శాతం ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాస్తవంగా ఇది ఒకటి నుండి రెండు శాతం మాత్రమేననే వాదనలు ఉన్నాయి. ఆర్బీఐ కూడా కరోనా ప్రారంభమైనప్పటి నుండి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు పలు పర్యాయాలు 115 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించింది. పరిశ్రమ ఎంతగానో ఎదురుచూస్తున్న రుణాల పునర్వ్యవస్థీకరణకు గురువారం ఆర్బీఐ పచ్చజెండా ఊపింది.


Click it and Unblock the Notifications