ఎస్బీఐ లాంటి మరో నాలుగైదు బ్యాంకులు అవసరం: నిర్మలా సీతారామన్
దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) వంటి నాలుగైదు పెద్ద బ్యాంకులు అవసరమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం అన్నారు. తద్వారా పరోక్షంగా మున్ముందు మరిన్ని బ్యాంకుల విలీనం జరుగుతుందని సంకేతాలు ఇచ్చారు. ముంబైలో ఆదివారం జరిగిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA) 74వ వార్షిక సదస్సులో ఆమె కీలక ఉపన్యాసం చేశారు. మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ విభిన్న మార్గం వైపు మళ్లుతోందన్నారు. రూపాంతరం చెందుతోన్న బ్యాంకింగ్ వ్యవస్థకు పలు కొత్త సవాళ్లు ఎదురవుతాయని, వాటిని ఎదుర్కొనేందుకు పెద్ద బ్యాంకుల అవసరం ఉందన్నారు. సుస్థిర భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమను సృష్టించడంలో నిరంతరాయ అనుసంధానమైన డిజిటల్ వ్యవస్థలు ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు.

బ్యాంకులకు ప్రశంస
కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకుసేవల్లో అంతరాయం కలగకుండా బ్యాంకుల విలీనాన్ని సజావుగా పూర్తి చేసినందుకు నిర్మలమ్మ బ్యాంకులను ప్రశంసించారు. నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(NARCL), ఇండియా డెట్ రీసొల్యూషన్ కంపెనీ లిమిటెడ్(IDRCL) ఏర్పాటులో కలిసి పని చేసినందుకు ఐబీఏకు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వివిధ బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారం, పునర్వ్యవస్థీకరణలో NARCL, IDRCL కలిసి పని చేస్తాయన్నారు. NARCL బ్యాడ్ బ్యాంకు కాదని స్పష్టం చేశారు.

బ్యాంకులు మరింత పటిష్టం
దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మరింత పటిష్టం కావాల్సి ఉందని నిర్మలమ్మ అన్నారు. పెరుగుతున్న ఆర్థిక, పారిశ్రామిక అవసరాల దృష్ట్యా మరో నాలుగైదు ఎస్బీఐ స్థాయి బ్యాంకుల అవసరం ఉందన్నారు. మన దేశంలో పెద్ద బ్యాంకుల అవసరం ఉందన్నారు. ఆ లక్ష్యంతోనే బ్యాంకుల విలీనం చేపట్టినట్లు తెలిపారు. పీఎస్‌బీ విలీనాలపై కొన్ని భయాలు వ్యక్తమైనా, అంతా సాఫీగానే జరిగిందన్నారు. ఈ బ్యాంకుల సాఫ్టువేర్ ఒకదానితో ఒకటి సమ్మిళితమై ఉండటం ఇందుకు ప్రధాన కారణమన్నారు. పీఎస్‌బీ, ప్రయివేటు బ్యాంకుల డిజిటల్ వ్యవస్థల్లోను ఇలాంటి సమ్మిళితం ఉండాలన్నారు. మున్ముందు డిజిటల్ సేవలే బ్యాంకింగ్ భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు.

నిర్మలమ్మ ఆందోళన
భారత్‌లోని ఇంకా కొన్ని జిల్లాల్లో బ్యాంకు శాఖలే లేకపోవడంపై నిర్మలమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ లోపాన్ని సరిదిద్దాలని IBAను కోరారు. ఆర్థిక కార్యకలాపాలు బాగా అభివృద్ధి చెందిన కొన్ని జిల్లాల్లోను ఇప్పటికీ చాలినన్ని బ్యాంకు శాఖలు లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలో ఒక పూర్తిస్థాయి బ్యాంకు శాఖ లేదా బ్యాంకింగ్ సేవలు అందించే కేంద్రాన్ని అయినా ఏర్పాటు చేసేందుకు IBA వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.


Click it and Unblock the Notifications