Tax rules: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! కొత్త ఐటీ చట్టంతో మారిన రూల్స్.. ఇకపై ఆ పోర్టల్ ద్వారానే సేవలు!
దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం ఆదాయపు పన్ను శాఖ (I-T Department) కీలక అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 (I-T Act 2025) అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే టీడీఎస్ (TDS) , టీసీఎస్ (TCS) సంబంధిత సేవల కోసం సరికొత్తగా అప్‌గ్రేడ్ చేసిన 'ట్రేసెస్' (TRACES) పోర్టల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త వ్యవస్థ వల్ల ట్యాక్స్ కంప్లయన్స్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది.

కొత్త పోర్టల్ ను ఎలా యాక్సెస్ చేయాలి?
పన్ను చెల్లింపుదారులు తమ టీడీఎస్ సర్టిఫికెట్లు, ఫారాలు , కరెక్షన్ల కోసం traces.tdscpc.gov.in అనే కొత్త వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. పాత లింక్‌ను క్లిక్ చేసినా అది ఆటోమేటిక్‌గా కొత్త పోర్టల్‌కే రీడైరెక్ట్ అవుతుంది. ఇక ఎన్నారై (NRI) ట్యాక్స్ పేయర్ల కోసం ప్రత్యేకంగా nriservices.tdscpc.gov.in అనే పోర్టల్‌ను కేటాయించారు. ఈ కొత్త సైట్‌లో డ్యాష్‌బోర్డ్ చాలా క్లియర్ గా ఉంది, దీనివల్ల యూజర్లు నావిగేషన్ చేయడం సులభం అవుతుంది.
పాత ఫారాల స్థానంలో కొత్తవి.. ఏవి దేనికోసం?
కొత్త ట్యాక్స్ రూల్స్ (Tax rules) ప్రకారం, పాత ఫారాలైన 24Q , 26Q ల స్థానంలో కొత్త ఫారాలను ప్రవేశపెట్టారు.
- ఫారం 138 (Form 138): కంపెనీలు లేదా యజమానులు తమ ఉద్యోగుల జీతాల నుంచి కోసే టీడీఎస్ వివరాలను నివేదించడానికి దీనిని వాడాలి. అలాగే సీనియర్ సిటిజన్ల పెన్షన్లపై టీడీఎస్ వివరాలకు కూడా ఇదే ఫారం అవసరం.
- ఫారం 140 (Form 140): జీతం కాకుండా ఇతర చెల్లింపులు అంటే కమిషన్, బ్రోకరేజ్, ప్రొఫెషనల్ ఫీజు లేదా ఇంటి అద్దెపై కోసే టీడీఎస్ వివరాల కోసం దీనిని ఉపయోగించాలి.
ఆస్తి కొనుగోలుదారులకు ముఖ్య గమనిక
మీరు కొత్తగా ఏదైనా ప్రాపర్టీ కొన్నప్పుడు చెల్లించే టీడీఎస్ కోసం ఈ కొత్త పోర్టల్‌ను నేరుగా వాడలేరు. టీడీఎస్ పేమెంట్ ఎప్పటిలాగే ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఫారం 26QB ఉపయోగించి చేయాల్సి ఉంటుంది. అయితే, పేమెంట్ పూర్తయిన తర్వాత ఫారం 16B ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి లేదా ఏవైనా తప్పులను సరిదిద్దుకోవడానికి మాత్రం ట్రేసెస్ పోర్టల్‌ను వాడుకోవచ్చు.
భారీగా తగ్గిన టీసీఎస్ (TCS) రేట్లు
కొత్త నిబంధనల వల్ల విదేశీ ప్రయాణాలు చేసే వారికి , విదేశాల్లో చదువుకునే వారికి పెద్ద ఊరట లభించింది.
- విదేశీ టూర్ ప్యాకేజీలు: గతంలో ₹10 లక్షల కంటే ఎక్కువ ఉంటే 20% వరకు ఉన్న టీసీఎస్ రేటును ఇప్పుడు అన్నింటికీ కలిపి ఫ్లాట్ 2% కు తగ్గించారు.
- వైద్యం , విద్య: విదేశాలకు పంపే మెడికల్ , ఎడ్యుకేషన్ ఫండ్స్ పై టీసీఎస్ 5% నుండి 2% కి తగ్గించబడింది.
మొత్తానికి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ద్వారా డిజిటల్ రిపోర్టింగ్‌ను పెంచడం , ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్‌లో పారదర్శకత తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. ట్యాక్స్ పేయర్లు ఈ మార్పులను గమనించి, గడువులోపు తమ రిటర్న్స్ , టీడీఎస్ స్టేట్‌మెంట్లను సమర్పించడం ద్వారా పెనాల్టీల బారి నుండి తప్పించుకోవచ్చు.


Click it and Unblock the Notifications