టాటా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని పునర్నియమించాలని NCLAT ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ టాటా సన్స్ దాఖలు చేసిన పిటిషన్ పైన వాదనను సుప్రీం కోర్టు ఈ నెల 10వ తేదీన విచారణ చేపట్టే అవకాశముంది. ఈ విషయంలో తమను పరిగణలోకి తీసుకోవాలని, తమను పరిగణలోకి తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వవద్దని సైరస్ మిస్త్రీ, సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రయివేటు లిమిటెడ్, మరిన్ని సంస్థలు కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేశాయి.
టాటా సన్స్ - సైరస్ మిస్త్రీ ఇష్యూ
ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తిరిగి తీసుకోవాలని NCLAT ఇచ్చిన ఆదేశాలను టాటా సన్స్ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. టీసీఎస్ కూడా అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కింది. సంస్థ బోర్డులో డైరెక్టర్‌గా మిస్త్రీని పునర్నియమిస్తూ NCLAT ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. టాటా సన్స్, రతన్ టాటా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గురువారం టాటా సన్స్, శుక్రవారం గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పిటిషన్లు వేయగా, జనవరి 3న సాఫ్టువేర్ దిగ్గజం, టాటా గ్రూప్‌కు చెందిన టీసీఎస్ NCLAT నిర్ణయాన్ని తప్పుబడుతూ కోర్టుకు వెళ్లింది. NCLAT డిసెంబర్ 18, 2019న ఇచ్చిన తీర్పును తప్పుపడుతూ పిటిషన్ దాఖలు చేసిందని టీసీఎస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లు శనివారం తెలిపింది.
డిసెంబర్ 18న టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని పునర్నియమిస్తూ NCLAT తీర్పు చెప్పింది. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నియామకాన్ని అక్రమంగా పేర్కొంది. అయితే ఈ తీర్పుపై స్టే విధించాలని, NCLAT ఆదేశం టాటా గ్రూప్‌లోని పలు సంస్థలను అయోమయానికి గురి చేస్తోందని, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో ఉన్న కంపెనీల షేర్లను ప్రభావితం చేస్తుందని టాటా సన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మరోవైపు, టాటా-మిస్త్రీ కేసు తీర్పులో సవరణలు చేయాలన్న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అభ్యర్థనను NCLAT తిరస్కరించింది. టాటా సన్స్‌ను ప్రయివేటు కంపెనీగా మార్చేందుకు అనుమతులు ఇవ్వడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఇచ్చిన తీర్పులో, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ పైన ఎటువంటి ఆంక్షలు విధించలేదని గుర్తు చేసింది.


Click it and Unblock the Notifications