Insurance News: వాహనదారులకు NCDRC హెచ్చరికలు.. అలా చేయకపోతే తీరని నష్టమే..
Vehicle Insurance: ఏవైనా అనుకోని ప్రమాదాలు జరిగిన సమయంలో కొంతమేర నష్టాలను తగ్గించుకునేందుకు వాహన బీమా కొనుగోలు చేస్తుంటారు. అయితే ఆయా వాహనాలను తిరిగి వేరొకరికి విక్రయించే వేళ జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. తద్వారా లేని సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని NCDRC వాహనదారులను హెచ్చరించింది.
వాహనాల కొనుగోలు సమయంలో వాటిపైన బీమా పాలసీని సరిగ్గా బదిలీ చేయాల్సిందేనని శ్రీ సుభాష్ చంద్ర అధ్యక్షత వహించిన జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్ తేల్చి చెప్పింది. సరైన విధానాన్ని అనుసరించని పక్షంలో బీమా విషయమై సదరు జారీ కంపెనీ బాధ్యత వహించదని స్పష్టం చేసింది. తమ ముందుకు వచ్చిన ఓ కేసులో ఇదే తరహా ఆదేశాలు ఇచ్చింది.

వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి 20 లక్షలు వెచ్చించి స్కోడా కారును కొనుగోలు చేశారు. కొంతకాలం తర్వాత 11.26 లక్షలకు మరొకరికి విక్రయించారు. అనంతరం ఫిర్యాదుదారు ప్రీమియం చెల్లించి తమ పేరుకు పాలసీని బదిలీ చేయాలని అభ్యర్థించారు. కానీ కంపెనీ కారు అసలు యజమాని పేరిట బీమా జారీ చేసింది. అదే కారు ప్రమాదానికి గురి కావడంతో పాలసీలోని వ్యక్తి పేరు గురించి ఫిర్యాదుదారు బీమా సంస్థకు తెలియజేశారు. అయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇప్పటికీ అసలు యజమాని పేరుమీదే ఉండటంతో అలా చేసినట్లు స్పష్టం చేసింది.
దీంతో కారు రిపేరు కోసం 21.36 లక్షలు ఖర్చు అయ్యాయని, వాటిని రిలీజ్ చేయాలంటూ ఫిర్యాదుదారు చేసిన క్లెయిమ్‌ను బీమా కంపెనీ తిరస్కరించింది. రిపేర్ ఖర్చులు, ఇతర నష్టాలకు పరిహారం కోరుతూ ఫిర్యాదుదారు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. న్యాయపరమైన సవాళ్లను పేర్కొంటూ రాష్ట్ర కమిషన్ ఫిర్యాదును తోసిపుచ్చగా.. జాతీయ కమిషన్‌లో రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా అదే కారణంతో జాతీయ కమిషన్ అప్పీల్‌ను తోసిపుచ్చింది. ఈ తరహా కొనుగోళ్లలో బీమా బదిలీకి సంబంధించి జాగ్రత్త వహించాలని సూచించింది.


Click it and Unblock the Notifications