LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?
ఇరాన్ యుద్ధం కారణంగా ఇప్పటికే అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతుంటే, భారత్‌కు మరో కొత్త సమస్య వచ్చి పడింది. దేశంలోని రెండవ అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీ అయిన 'నయారా ఎనర్జీ' (Nayara Energy) తన వదినార్ రిఫైనరీని ఏప్రిల్ మొదటి వారం నుండి 35 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించింది. దీనివల్ల దేశంలోని మొత్తం రిఫైనింగ్ సామర్థ్యంలో దాదాపు 8 శాతం మేర కోత పడనుంది. ఇప్పటికే ఎల్పీజీ (LPG), పెట్రోల్ దిగుమతులపై ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో ఈ వార్త ఆందోళన కలిగిస్తోంది.

వదినార్ రిఫైనరీ మూతకు కారణమేంటి?
గుజరాత్‌లోని వదినార్‌లో ఉన్న ఈ రిఫైనరీలో మెయింటెనెన్స్ పనులు గత ఏడాది నుండే పెండింగ్‌లో ఉన్నాయి. రష్యాకు చెందిన రోస్ నెఫ్ట్ (Rosneft) మద్దతు ఉన్న సంస్థ కావడంతో, ఐరోపా దేశాల ఆంక్షల వల్ల కెమికల్స్ , ఇతర పరికరాల సరఫరాలో జాప్యం జరిగింది. ఇప్పుడు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో ఏప్రిల్ నుండి పనులను ప్రారంభించనున్నారు. ఈ 35 రోజుల పాటు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోనుంది. నయారా ఎనర్జీకి దేశవ్యాప్తంగా దాదాపు 7,000 పెట్రోల్ బంకులు ఉన్నాయి, వీటన్నింటికీ ఈ రిఫైనరీ నుండే ఇంధనం సరఫరా అవుతుంది.
ఎల్పీజీ, ఇంధన సరఫరాపై ప్రభావం
ప్రస్తుతం ఇరాన్ యుద్ధ పరిస్థితుల వల్ల ముడిచమురు దిగుమతులు ఇప్పటికే 20 శాతం వరకు తగ్గాయి. ముఖ్యంగా ఎల్పీజీ (LPG) సరఫరా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నయారా రిఫైనరీ మూతపడటం వల్ల గ్యాస్, పెట్రోల్ లభ్యత మరింత తగ్గే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF), పెట్రోల్ ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా రిటైల్ ధరలు మారకపోవడంతో చమురు సంస్థలు ఇప్పటికే నష్టాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో దేశీయ ఉత్పత్తి తగ్గడం గమనార్హం.
బఫర్ స్టాక్ ఉందా?
అయితే ఈ షట్‌డౌన్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా తగినంత ఇంధన నిల్వలను (Buffer Reserves) సిద్ధం చేశామని నయారా ఎనర్జీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఒక రిఫైనరీ మూతపడినప్పుడు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సరఫరాను సర్దుబాటు చేస్తాయి. కానీ, ప్రస్తుతం దిగుమతి ఆంక్షలు , యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఈ షట్‌డౌన్ దేశీయ ఇంధన మార్కెట్‌ను ఏ మేరకు ప్రభావితం చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రభుత్వం అప్రమత్తం కావాలి
నగరాల్లో ఇప్పటికే పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రిఫైనరీ మూత వార్త ప్రజల్లో మరింత ఆందోళన కలిగించవచ్చు. పౌర సరఫరాల శాఖ , కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఇతర రిఫైనరీలతో సమన్వయం చేసుకుని ఎల్పీజీ (LPG) , పెట్రోల్ కొరత రాకుండా చూడాలి. ముఖ్యంగా వేసవి కాలంలో ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా అవసరం. యుద్ధం త్వరగా సద్దుమణిగి, దిగుమతులు సాధారణ స్థితికి వస్తేనే ఈ గండం గట్టెక్కే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications