Budget News: ఉద్యోగార్థులకు త్వరలో మంచి రోజులు.. కేంద్రం వద్ద నైపుణ్యాభివృద్ది సంస్థ కీలక ప్రతిపాదనలు
Skill Development: మరో నాలుగు రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతం దీని గురించే చర్చ జరుగుతోంది. నవంబర్‌లో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో మోదీ సర్కారు ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవల ఎలక్షన్స్‌లో ప్రజల నుంచి వ్యతిరేకత రావడాన్ని గమనించి, వారిని శాంతింప చేయడానికి పలు తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నైపుణ్యాభివృద్ధి కోసం చేసే ఖర్చుపై మరిన్ని పన్ను ప్రయోజనాలు కల్పించాలని నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రజెంటేషన్‌లో తన కోరికను వెల్లడించింది. ట్యూషన్ ఫీజులు, రుణాల వడ్డీపై తగ్గింపులు, స్కాలర్‌షిప్‌లకు మినహాయింపులు, అర్హత కలిగిన నైపుణ్య సంస్థలకు తక్కువ పన్ను రేట్లు, నైపుణ్య కార్యక్రమాల విషయంలో విద్యా సంస్థలకు మినహాయింపులు, శిక్షణ సంస్థలకు పన్ను రాయితీలు మరియు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) తగ్గింపు వంటి పలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ఈ విధమైన పన్ను ప్రయోజనాలు కల్పించడం ద్వారా సదరు సంస్థలు తక్కువ ఖర్చుతో పనిచేయడానికి అవకాశం లభిస్తుందని NSDC భావిస్తోంది. దాంతో అత్యంత సరసమైన ధరకే మెరుగైన, నాణ్యతతో కూడిన శిక్షణ అందించవచ్చని తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వం విద్యా వ్యవస్థపై దృష్టిసారించి సదరు సంస్థలకు ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పించడంతో దేశం అక్షరాస్యత నిష్పత్తిలో గణనీయమైన వృద్ధి సాధించినట్లు గుర్తు చేసింది. మరిన్ని చర్యలు చేపడితో భవిష్యత్ తరాలకు ఎంతో మేలు కలుగుతుందని అభిప్రాయపడింది.
లాభాపేక్ష లేని విశ్వవిద్యాలయాలు మరియు ఇతర విద్యా సంస్థలకు నిబంధనలకు అనుగుణంగా, ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని NSDC కేంద్రాన్ని కోరింది. ఆయా సంస్థలపై ఆర్థిక భారం తగ్గితే అవి మరింత మందిని నైపుణ్యాభివృద్ధి వైపు ప్రోత్సహిస్తాయని చెబుతోంది. వృత్తిపరమైన కోర్సుల శిక్షణ కోసం కూడా దీన్ని వర్తింపచేస్తే సంచలన విజయాలు నమోదవుతాయని అంచనా వేస్తోంది.


Click it and Unblock the Notifications