భారతదేశపు అత్యున్నత ఐటీ సేవల పరిశ్రమ సంస్థ నాస్కామ్ భారత ఐటీ రంగంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఐటీ పరిశ్రమ కీలకమైన దశలో ఉందని తెలిపింది. కృత్రిమ మేధస్సు (AI), ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతికతల ప్రాముఖ్యత పెరగడంతో ఆందోళన వ్యక్తం చేసింది. వేలాది మంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోక తప్పని పరిస్థితి నెలకొని ఉందని తెలిపింది. భవిష్యత్తులో కొంత స్థాయి ఉద్యోగ కోతలు జరగవచ్చని నాస్కామ్ అంచనా వేసింది.
TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ప్రపంచ వ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే నాస్కామ్ నుంచి ఈ ప్రకటన వచ్చింది.టీసీఎస్ సంస్థ మొత్తం శ్రామిక శక్తిలో సుమారుగా 2 శాతం ఉద్యోగులను ఇంటికి సాగనంపుతోంది. మధ్యస్థ, సీనియర్ స్థాయి ఉద్యోగులే ఇందులో భాగంగా ఉన్నారు. నాస్కామ్ ప్రకారం వ్యాపార కార్యకలాపాలు ప్రస్తుతం AI కేంద్రంగా కొనసాగుతున్నాయి.

దీనివల్ల సర్వీస్ డెలివరీ మోడళ్లు, వర్క్‌ఫోర్స్ స్ట్రక్చర్లలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సంస్థలు ఎక్కువగా వేగం, ఆవిష్కరణ, సామర్థ్యంపై దృష్టి పెట్టడంతో, సాంప్రదాయ నైపుణ్యాల విలువ తగ్గుతోందని తెలిపింది. ఈ మార్పులకు అనుగుణంగా కంపెనీలు కూడా మారాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. నాస్కామ్ ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికం నాటికి 1.5 మిలియన్లకు పైగా టెక్ నిపుణులు AI జనరేటివ్ AIలో శిక్షణ పొందారు. ఇందులో 95 వేల మందికి పైగా ఉద్యోగులు క్లౌడ్, ఎంబెడెడ్ AI, అప్లైడ్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో సర్టిఫికెట్లు పొందారు.
భవిష్యత్తులో ఐటీ కంపెనీలు సాధారణ నైపుణ్యాల కంటే డొమైన్-స్పెసిఫిక్, లోతైన నైపుణ్యాలను ఉన్నవారిని నియమించుకునే అవకాశముందని నాస్కామ్ తెలిపింది. ఉద్యోగ అవకాశాలు పూర్తిగా మాయం కాకపోయినప్పటికీ వినూత్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు కలిగి ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. నాస్కామ్ ప్రకారం.. సాంకేతికత సవాళ్లను తీసుకురావడమే కాకుండా కొత్త అవకాశాలతో పాటు టెక్నాలజీని అందిపుచ్చుకునే అవకాశాలను కూడా తీసుకువస్తోంది. అందుకే రీస్కిల్లింగ్, క్రాస్-స్కిల్లింగ్, కంటిన్యూయస్ లెర్నింగ్ వంటి అంశాలను ప్రతి ఉద్యోగి పరిగణనలోకి తీసుకోవాలని చెబుతోంది.
దేశ ఐటీ రంగంలో కృత్రిమ మేధస్సు (AI) తీసుకొస్తున్న మార్పులు ఇప్పటికే పెద్ద సంస్థలపై ప్రభావం చూపడం ప్రారంభమయ్యింది. AI, ఆటోమేషన్, క్లౌడ్ టెక్నాలజీల ప్రాధాన్యం పెరగడంతో, పారంపర్య నైపుణ్యాలు తప్పనిసరిగా మార్చాల్సిన అవసరం వచ్చింది. టీసీఎస్ ప్రకటన ప్రకారం, సంస్థ తమ వ్యాపార అవసరాలకు సరిపడని స్కిల్స్ ఉన్న ఉద్యోగులను బయటకు సాగనంపుతోంది.
ఈ వార్త వెలువడిన వెంటనే మంగళవారం ట్రేడింగ్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే టీసీఎస్ స్టాక్ రూ.6,550 కోట్ల విలువను కోల్పోయింది. సోమవారం నాటి అమ్మకాల్లో మరో రూ.20 వేల కోట్లు ఆవిరయ్యాయి. రెండు రోజుల్లో కలిపి రూ.26,550 కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరి అయింది. దాంతో, టీసీఎస్ స్టాక్ 33 నెలల కనిష్టానికి పడిపోయింది. ఇప్పటి వరకు 2025లో మాత్రమే 25% క్షీణత నమోదు చేయడం గమనార్హం.


Click it and Unblock the Notifications