Health Insurance: హెల్త్ ఇన్స్యూరెన్స్ లాంచ్ చేసిన హాస్పిటల్.. దేశంలో ఇదే తొలిసారి.. ప్రీమియం కూడా తక్కువే
Narayana Health Insurance: దేశంలో ఆరోగ్య బీమా విభాగం వేగంగా వృద్ధి చెందుతోంది. అందుకే LIC వంటి దిగ్గజ సంస్థ కూడా ఈ సెక్టార్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దానితో పాటు పలు ఇతర కంపెనీలు కూడా కొత్తగా ఈ విభాగంలో ఎదిగేందుకు రెడీ అవుతున్నాయి. కాగా దేశంలో మొదటిసారి ఓ హాస్పిటల్ కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్ అందించేందుకు ముందుకు వచ్చింది.
బెంగళూరుకు చెందిన హాస్పిటల్ చైన్ నారాయణ హెల్త్ కొత్తగా హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్ లాంచ్ చేసింది. నారాయణ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ (NHIL) ద్వారా తన మొదటి బీమా ఉత్పత్తి 'అదితి'ని ప్రకటించింది. ఆపరేషన్లకు 1 కోటి మరియు సాధారణ వైద్య ఖర్చుల కోసం 5 లక్షల మేర నారాయణ హెల్త్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో నలుగురు కుటుంబ సభ్యులకు సమగ్ర కవరేజీని అందిస్తుంది.

సరసమైన ధరలోనే హెల్త్ ఇన్స్యూరెన్స్ అందించడం ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సంరక్షణలో ఉన్న అంతరాన్ని తగ్గించడం తమ లక్ష్యం అని సంస్థ అధినేత దేవి శెట్టి పేర్కొన్నారు. కేవలం ఏడాదికి 10 వేల ప్రీమియం చెల్లించి ఈ బీమాను పొందవచ్చన్నారు. భారతదేశ వ్యాప్తంగా దాదాపు 21 హాస్పిటల్ నెట్‌వర్క్‌లు మరియు అనేక క్లినిక్‌లకు ఈ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌తో యాక్సెస్ దొరుకుతుంది. ఒక్క బెంగళూరులోనే దాదాపు 7 ఆసుపత్రులు మరియు 3 క్లినిక్‌ల నుంచి సేవలు లభిస్తాయి.
'భారతదేశంలో ఏటా 70 మిలియన్ల శస్త్రచికిత్సలు నిర్వహించాల్సిన అవసరం ఉంది కానీ కేవలం 20 మిలియన్లు మాత్రమే జరుగుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో మిగిలిన 50 మిలియన్ల మంది చికిత్స పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని మేము భావిస్తున్నాం' అని శెట్టి తెలిపారు. ఈ ఇన్స్యూరెన్స్‌ను మొదట పైలట్ ప్లాన్ గా మైసూరు మరియు బెంగళూరులో, తర్వాత కోల్‌కతా మరియు ఢిల్లీలకు విస్తరించనున్నారు.


Click it and Unblock the Notifications