ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్పులకు గురి చేస్తోంది. కృత్రిమ మేధస్సు మానవ జీవితంలోకి అమితవేగంతో దూసుకువస్తోంది. మనం ఎలా జీవించాలో, ఎప్పుడుపనిచేయాలో, ఎవరితో మాట్లాడాలో అన్నీ ఏఐ డిసైడ్ చేస్తోంది. ఈ ఏఐ విప్లవంపై ఆధార్, యూపీఐ వంటి సాంకేతిక విప్లవాలకు ఆధ్యుడైన నందన్ నీలేకని కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో త్వరితగతిన ఎదుగుతున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - AI)తో దేశ సంపద పెరుగుతుందని తెలిపారు. భారత్‌లో సంపద సృష్టికి AI దారితీస్తుందని చెప్పుకొచ్చారు.
అదే సమయంలో ఉద్యోగాల ఆందోళనపై ఆయన మాట్లాడుతూ.. ఏఐ మన దేశంలో ఎటువంటి ఉద్యోగాలను హరించదని స్పష్టం చేశారు. కొత్త ఉద్యోగ అవకాశాలను క్రియేట్ చేస్తుందని చెప్పుకొచ్చారు. వ్యవస్థాగత పరిష్కారాలను అందిస్తుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా AI, ఆటోమేషన్, జనరేటివ్ టెక్నాలజీ అభివృద్ధి వల్ల లక్షలాది ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీని బారీనపడి లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు.ఇలాంటి పరిస్థితుల్లో నందన్ నీలేకని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం

AI టూల్స్ ఉద్యోగుల్లో భయం కలిగించాల్సిన అవసరం లేదు. అవి మన పనులను వేగవంతం చేస్తాయి, సమర్థతను పెంచుతాయి. ఉద్యోగం పోతుందని భయపడే బదులు, AI శక్తిని మన పనిలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.అయితే AI సంపదతో పాటు శక్తిని కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరించే అవకాశముంది. అది భయపడాల్సిన విషయం కాదన్నారు. కానీ మన దేశానికి అనువైన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు.
అమెరికా, చైనా వంటి దేశాలు బిలియన్ల డాలర్ల పెట్టుబడులతో భారీ AI మోడళ్లను అభివృద్ధి చేస్తున్నాయన్నారు. అయితే భారత్ అలాంటి రేసులోకి వెళ్లాల్సిన అవసరం లేదని..వాస్తవ సమస్యల పరిష్కారాలపై దృష్టి పెట్టాలని నీలేకని స్పష్టం చేశారు.మన దేశానికి ప్రపంచ శక్తులతో పోటీ పడే అవసరం లేదన్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని కోట్లాది ప్రజల వాస్తవ సమస్యలపై దృష్టి పెట్టాలి. భారతదేశం వంటి భారీ జనాభా కలిగిన దేశంలో AI ద్వారా సామూహిక పరిష్కారాలు సృష్టించాలని కోరారు.
భాషా అడ్డంకులతో పాటుగా ఆరోగ్య రంగం, విద్యా రంగాల్లో అనుసంధాన లోపాలను సరిదిద్దడంపై మనం దృష్టి పెట్టాలన్నారు. టెక్నాలజీ ప్రయోజనం అన్నది మానవులకు చేరాలని తెలిపారు. భవిష్యత్తు తరం కోసం తగిన మౌలిక మద్దతు అవసరమని నొక్కి చెప్పారు. ఇందులో భాగంగా AI, డేటా, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ వంటి రంగాల్లో యువత నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. నూతన టెక్నాలజీలను నేర్చుకునే సాహసం వారు చేయాలన్నారు. వాటిని సమర్థంగా ఉపయోగించగల సామర్థ్యం ఉండాలంటే విద్యా వ్యవస్థలోనే మార్పులు రావాలని నందన్ నీలేకని తెలిపారు.
AI మన జీవితాల్లో ఉన్న సామర్థ్యాన్ని పెంచడం కోసం ఉండాలన్నారు. యంత్రాలు మన కోసం పని చేస్తాయి కాబట్టి మనం బీచ్‌లో విశ్రాంతి తీసుకుంటాం అనే ఆలోచన అర్థరహితమని..ప్రతి ఒక్కరూ దీన్ని విడనాడాలని పిలుపునిచ్చారు. భారతదేశం ఒక బిలియన్ మందికి పైగా జనాభా ఉన్న దేశం కాబట్టి లక్ష్యాలను చేరుకోవాలంటే కొత్త ఆవిష్కరణలు అవసరమని నొక్కి చెప్పారు. UPI లాంటిది ప్రపంచంలో ఎక్కడా లేదు. 1 రూపాయి పంపినా టాక్స్ లేదు, ఆలస్యం లేదు..ఇదంతా మినిమలిస్టిక్ డిజైన్ వల్లే సాధ్యమైంది..ఇలాగే ఏఐ కూడా మన దేశంలో భాగం కావాలని ఆధార్ సృష్టికర్త తెలిపారు.


Click it and Unblock the Notifications