బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..
బెంగళూరు నగర రవాణా వ్యవస్థలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా మెట్రో బ్లూ లైన్ నిర్మాణంలో జరుగుతున్న పరిణామాలు, ఇతర మెట్రో లైన్ల అడ్డంకులపై బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) తాజాగా వెల్లడించిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. బెంగళూరు మెట్రో బ్లూ లైన్ (సిల్క్ బోర్డ్ జంక్షన్ నుండి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు) మే 2026 నాటికి తన మొదటి రెండు రైళ్లను అందుకోనుంది. అయితే రైళ్లు వచ్చిన వెంటనే పట్టాలెక్కే అవకాశం లేదని.. మౌలిక సదుపాయాల కల్పనలో ఇంకా కొన్ని సవాళ్లు మిగిలే ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుత ఒప్పందం ప్రకారం, BEML సంస్థ మొత్తం 53 రైళ్లను సరఫరా చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా బ్లూ లైన్ కోసం ప్రత్యేకించిన 7, 8వ నంబర్ ట్రైన్‌సెట్లను మే నెలలో అందజేయాలని మెట్రో అధికారులు కోరారు. ఈ బ్లూ లైన్ రైళ్లలో ప్రత్యేకత ఏమిటంటే.. విమానాశ్రయ ప్రయాణీకుల సౌకర్యార్థం వీటిలో ప్రత్యేకమైన లగేజ్ ర్యాక్‌లు, విభిన్నమైన బ్రాండింగ్ స్టిక్కర్లు ఉంటాయి. సిగ్నలింగ్ విషయానికి వస్తే.. పింక్ లైన్, బ్లూ లైన్ రెండూ కూడా అత్యాధునిక 'కమ్యూనికేషన్స్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్' (CBTC) టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి.

అయితే, రైళ్లు అందుబాటులోకి వచ్చినా, సిల్క్ బోర్డ్ జంక్షన్ నుండి కేఆర్ పురం (ఫేజ్ 2A) మార్గంలో ట్రయల్ రన్‌లు ప్రారంభించడానికి సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ మార్గంలో సివిల్ పనులు 85 శాతం పూర్తయినప్పటికీ, బైయప్పనహళ్లి డిపోకు కనెక్టివిటీ కల్పించే వయాడక్ట్, ట్రాక్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. రైళ్లు డిపో నుండి ప్రధాన మార్గంలోకి ప్రవేశించాలంటే ఈ కనెక్టివిటీ తప్పనిసరి. భూసేకరణ సమస్యల వల్ల ఈ పనులు కొంత ఆలస్యమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఫేజ్ 2A పనులను, వచ్చే ఏడాది చివరి నాటికి విమానాశ్రయ మార్గాన్ని (ఫేజ్ 2B) పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మరోవైపు పింక్ లైన్ విషయంలో భిన్నమైన సమస్య నెలకొంది. అక్కడ రైళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, రైల్వే బోర్డు లేవనెత్తిన డిజైన్ సంబంధిత ప్రశ్నల వల్ల రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) నుండి రావాల్సిన భద్రతా అనుమతులు నిలిచిపోయాయి. దీనివల్ల మే నెలలో ప్రారంభించాలనుకున్న కలెన అగ్రహార-తావరకెరె విభాగం పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే, పింక్ లైన్ రైళ్లకు లభించే సాంకేతిక అనుమతులు భవిష్యత్తులో బ్లూ లైన్‌కు కూడా వర్తిస్తాయి కాబట్టి, అది కొంత ఊరటనిచ్చే అంశం.
Bengaluru యెల్లో Metro లైన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అక్కడ ఎనిమిది రైళ్లు నడుస్తున్నాయి. వచ్చే వారం తొమ్మిదవ రైలు, మే నెలలో మరో రెండు రైళ్లు రానున్నాయి. మొత్తం 15 రైళ్లు అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే, ప్రయాణీకుల నిరీక్షణ సమయం తొమ్మిది నిమిషాల నుండి ఐదు నిమిషాలకు తగ్గుతుంది. మొత్తంగా చూస్తే.. బెంగళూరు మెట్రో విస్తరణలో రైళ్ల కొరత, భద్రతా అనుమతులు, డిపో కనెక్టివిటీ వంటి అంశాలు ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయి. ఈ సమస్యలన్నీ అధిగమిస్తేనే నగరం ట్రాఫిక్ కష్టాలు కొంతవరకు తీరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications