బెంగళూరు నగరవాసులకు 'నమ్మ మెట్రో' ఒక వరం లాంటిది. ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించేది ఏదైనా ఉందంటే అది మెట్రోనే. అయితే ఇప్పుడు మెట్రో ఛార్జీల గరించి కర్నాటకలో పెద్ద చర్చ జరుగుతోంది. సాధారణంగా మెట్రో అనేది ప్రజా రవాణా వ్యవస్థ కాబట్టి ధరలు తక్కువగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, బెంగళూరులో మెట్రో నిర్వహణ ఖర్చులు చూస్తుంటే ప్రయాణికులపై భారం తప్పేలా లేదు. అసలు నమ్మ మెట్రో ఎందుకు ఇంత ఖరీదైనదిగా మారుతోంది? ప్రభుత్వ వివరణ ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.

మెట్రో ధరలు ఎందుకు పెరుగుతాయి?
మెట్రో నిర్వహణ అనేది కేవలం రైళ్లు నడపడం మాత్రమే కాదు. దీని వెనుక భారీ ఖర్చులు ఉంటాయి. ముఖ్యంగా..
- నిర్వహణ , మరమ్మతులు (OMR Cost): రైళ్లు, స్టేషన్లు , పట్టాల నిర్వహణకు ఏటా కోట్ల రూపాయలు ఖర్చవుతాయి.
- విద్యుత్ ఛార్జీలు: మెట్రో నడవడానికి అవసరమైన కరెంట్ ధరలు పెరిగితే, ఆ భారం టికెట్లపై పడుతుంది.
- సిబ్బంది వేతనాలు: వేల సంఖ్యలో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలు కూడా ఒక కారణం.
- ద్రవ్యోల్బణం (CPI): మార్కెట్‌లో వస్తువుల ధరలు పెరిగినప్పుడు మెట్రో నిర్వహణ వ్యయం కూడా పెరుగుతుంది.
డీకే శివకుమార్ స్పష్టత: ఛార్జీల పెంపు ఎవరి చేతుల్లో ఉంది?
మెట్రో ఛార్జీల పెంపుపై వస్తున్న విమర్శలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ స్పందించారు. ఛార్జీలను పెంచడం లేదా తగ్గించడం అనేది రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం నేరుగా చేసే పని కాదని ఆయన స్పష్టం చేశారు. "కొత్త ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) ఏర్పాటయ్యే వరకు ఏ అధికారిక సంస్థకూ ధరలను సవరించే అధికారం లేదు," అని ఆయన సోమవారం స్పష్టం చేశారు.
మెట్రో మనుగడ సాగించాలన్నా, ప్రజలకు భారం కాకూడదన్నా శాస్త్రీయంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు అప్పుల చెల్లింపులతో కలిపి సుమారు రూ. 5,066 కోట్లు మెట్రో ప్రాజెక్టు కోసం ఇచ్చిందని గుర్తు చేశారు. గతంలో ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వానికి భాగస్వామ్యం ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ఛార్జీల పెంపును ఆపమని లేఖ రాసినా.. అది ఏ చట్టం ప్రకారం రాశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త ఎఫ్ఎఫ్‌సీ (FFC) ద్వారా మాత్రమే ధరలపై ఒక నిర్ణయం వస్తుందని ఆయన తేల్చి చెప్పారు.
ప్రయాణికుల పరిస్థితి ఏంటి?
మధ్యతరగతి ప్రజలు మెట్రోను ఆశ్రయించేదే సమయం , డబ్బు ఆదా అవుతుందని. ఇప్పటికే ఉన్న ధరలు సామాన్యులకు భారంగానే ఉన్నాయని టాక్ ఉంది. ఒకవేళ ఛార్జీలు పెరిగితే.. అది నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ప్రభుత్వం చెబుతున్నట్లు మెట్రో ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఆదాయం కూడా ముఖ్యమే. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే ఇప్పుడున్న పెద్ద సవాలు.
మొత్తానికి బెంగళూరు మెట్రో ధరల అంశం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. కమిటీ ఏర్పాటు, కేంద్ర-రాష్ట్రాల మధ్య చర్చల తర్వాతే ప్రయాణికులకు అసలు విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications