రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.2.3 కోట్లు చేతికి.. ఈ మ్యూచువల్ ఫండ్స్ 22 ఏళ్ల రిటర్న్స్ పై ఓ లుక్కేయండి..
భారతీయ మూలధన మార్కెట్లలో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు సంబంధించి కాంపౌండింగ్ ప్రాముఖ్యతను నిరూపిస్తూ రెండు ఈక్విటీ పథకాలు చారిత్రాత్మక రికార్డును నమోదు చేశాయి. ఆగస్టు 2004లో ప్రారంభించబడిన 'ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్', 'హెచ్‌ఎస్‌బిసి మిడ్‌క్యాప్ ఫండ్' తమ విజయవంతమైన 22 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాయి.
గత రెండు దశాబ్దాలలో భారత మార్కెట్ ఎన్నో ప్రపంచ ఆర్థిక మాంద్యాలను, తీవ్ర హెచ్చుతగ్గులను ఎదుర్కొన్నప్పటికీ, దీర్ఘకాలికంగా క్రమశిక్షణతో పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు ఈ ఫండ్లు అసాధారణమైన సంపదను సృష్టించి ఇచ్చాయి. వీటిలో ప్రారంభంలో పెట్టిన కేవలం రూ. 5 లక్షల ఏకమొత్తం పెట్టుబడి నేడు రూ. 2.3 కోట్ల కంటే ఎక్కువ మొత్తానికి పెరిగింది.

భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోని 'వాల్యూ' కేటగిరీలోనే అతిపెద్ద యాక్టివ్‌గా నిర్వహించబడుతున్న పథకంగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్ నిలిచింది. అంతర్గత విలువ కలిగిన స్టాక్స్‌ను ఎంచుకునే 'వాల్యూ ఇన్వెస్టింగ్' వ్యూహాన్ని అనుసరిస్తూ ఈ ఫండ్ గత 22 ఏళ్లలో వార్షికంగా 19.11 శాతం చక్రవడ్డీ రాబడిని (CAGR) ఇచ్చింది. ప్రారంభంలో ఈ ఫండ్‌లో పెట్టిన రూ. 1 లక్ష ఏకమొత్తం పెట్టుబడి విలువ జూలై 31, 2026 నాటికి రూ. 46.6 లక్షలకు పెరిగింది.
అదే సమయంలో నిఫ్టీ 50 టీఆర్ఐ (TRi) సూచీ 14.63 శాతం సీఏజీఆర్‌తో రూ. 20.1 లక్షలను మాత్రమే అందించింది. ఈ పథకంలో ప్రారంభంలోనే రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియో విలువ నేడు ఏకంగా రూ. 2.33 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ఈ ఒక్క ఫండ్ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ (AUM) రూ. 61,102.29 కోట్లుగా నమోదైంది. ఇది మొత్తం వాల్యూ కేటగిరీలోని మొత్తం ఆస్తుల్లో దాదాపు 28 శాతం కావడం విశేషం.
22 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న మరొక ప్రముఖ పథకం హెచ్‌ఎస్‌బిసి మిడ్‌క్యాప్ ఫండ్. మిడ్-క్యాప్ విభాగంలో బాటమ్-అప్ విధానంతో నాణ్యమైన కంపెనీలను ఎంచుకుంటూ ఈ ఫండ్ ఆగస్టు 2004 నుండి వార్షికంగా 18.92 శాతం సీఏజీఆర్ రాబడిని అందించింది. ఈ ఫండ్‌లో ప్రారంభంలో పెట్టిన రూ. 1 లక్ష నేడు రూ. 45.15 లక్షలుగా, రూ. 5 లక్షల పెట్టుబడి రూ. 2.26 కోట్లుగా మారింది. ఒకవేళ ఏకమొత్తం కాకుండా, ప్రారంభం నుండి నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ (SIP) రూపంలో పెట్టుబడి కొనసాగించి ఉంటే.. ఆ మొత్తం నేడు రూ. 2.43 కోట్లకు పెరిగి ఉండేది.
జూలై 31, 2026 నాటికి రూ. 15,578 కోట్ల ఏయూఎమ్ కలిగిన ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియో 55 ఈక్విటీ స్టాక్స్‌లో విస్తరించి ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ పరికరాలు, రిటైలింగ్, పారిశ్రామిక తయారీ, ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాలపై ఈ ఫండ్ ఎక్కువ దృష్టి సారించింది. ఈ సందర్భంలో హెచ్‌ఎస్‌బిసి మిడ్‌క్యాప్ ఫండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫండ్ మేనేజర్ చిను గుప్తా మాట్లాడుతూ.. నిలకడైన ఆదాయాలు, దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యం ఉన్న వ్యాపారాలను ఎంచుకోవడమే తమ విజయ రహస్యమని, రాబోయే రోజుల్లోనూ మిడ్-క్యాప్ విభాగంపై ఎంతో ఆశాజనకంగా ఉన్నామని పేర్కొన్నారు.
మొత్తం మీద చూసినట్లయితే.. ప్రతికూల మార్కెట్ పరిస్థితులలోనూ భయపడకుండా ఓపికగా దీర్ఘకాలం పాటు పెట్టుబడులను కొనసాగిస్తేనే మ్యూచువల్ ఫండ్స్‌లో ఆశించిన స్థాయిలో భారీ సంపద సృష్టి సాధ్యమవుతుందని ఈ రెండు ఫండ్ల రికార్డు రాబడులు స్పష్టం చేస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
