Murugappa: ఫైనాన్స్ వ్యాపారంలో అతిపెద్ద కంపెనీగా ఉన్న మురుగప్ప గ్రూప్ కొంత కాలంగా అంతర్గత విభేదాలతో సతమతమౌతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఎమ్ వి మురుగప్పన్ మరణం తర్వాత ఇవి తలెత్తాయి.
ఈ క్రమంలో తాజాగా వీటిని మురుగప్ప ఫ్యామిలీ పరిష్కరించుకునేందుకు చొరవ చూపింది. ఈ క్రమంలో మురుగప్ప కుటుంబ సభ్యులు తమ తమ సలహాదారుల సమక్షంలో జరిగిన సమావేశంలో కుటుంబ ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను ముందుగా చర్చించుకున్నట్లు వెల్లడైంది. వల్లి అరుణాచలం, వెల్లచ్చి మురుగప్పన్‌తో సహా కుటుంబ సభ్యులు.. ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు కుటుంబంలో సామరస్యాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో మిగిలిన కుటుంబ సభ్యులతో రహస్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

అమెరికాకు చెందిన వల్లి అరుణాచలం ఎంవీ మురుగప్పన్ పెద్ద కుమార్తె, కుటుంబ వాటా ఆధారంగా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అంబడి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో బోర్డు సీటు కావాలని గతంలో డిమాండ్ చేశారు. అయితే ఆమె అభ్యర్థనను అక్టోబర్ 2020లో వాటాదారులు తిరస్కరించారు. దీంతో రూ.36,893 కోట్ల విలువైన మురుగప్ప గ్రూప్‌కు చెందిన హోల్డింగ్ కంపెనీ అంబడి ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ లో డైరెక్టర్ పదవిపై వివాదం నెలకొంది. తన తండ్రి వారసురాలిగా కంపెనీలో గుర్తింపు కోసం ఆమె తన పోరాటాన్ని సాగించారు.
మురుగప్ప కుటుంబంలోని పితృస్వామ్య పద్ధతిలో మహిళలను గ్రూప్ వ్యాపారాలకు దూరంగా ఉంచడంపై అసలు వివాదం చెలరేగింది. తాజాగా సమస్యను పరిష్కరించుకునేందుకు ఫ్యామిలీ ముందుకు రావటంతో మురుగప్ప కుటుంబంపై వల్లి అరుణాచలం న్యాయపరమైన చర్యలు ఉపసంహరించుకోనున్నట్లు వెల్లడైంది. అలాగే రాబోయే 90 రోజుల్లో కుటుంబ ఏర్పాటును అమలు చేయడానికి అవసరమైన లావాదేవీలను చేపట్టేందుకు కుటుంబ సభ్యులు కట్టుబడి ఉన్నారు. దీంతో వివాదం సొమసిపోవటం ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. స్టాక్ మార్కెట్లో గ్రూప్ కంపెనీల షేర్లు 6 శాతానికిపైగా లాభపడ్డాయి.


Click it and Unblock the Notifications