Murugappa: సెమీకండక్టర్ల వ్యాపారంలోకి మురుగప్ప గ్రూప్.. భారీ పెట్టుబడి..!!
Murugappa: చెన్నై కేంద్రంగా మురుగప్ప గ్రూప్ దేశంలో అనేక రంగాల్లో తన వ్యాపారాలను కొనసాగిస్తోంది. చిప్ తయారీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న వేళ ప్రైవేటు సంస్థలు దీనిని అందిపుచ్చుకునేందుకు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్న తరుణంలో మురుగప్ప ముందుకొచ్చింది.
2020లో టేకోవర్ చేసిన CG పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ ద్వారా మురుగప్ప గ్రూప్ దేశంలోని సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. రానున్న ఐదేళ్లలో టెక్ తయారీ రంగంలో భాగస్వామిగా మారేందుకు 791 మిలియన్ డాలర్లను అంటే అక్షరాలా రూ.6,600 కోట్లు వెచ్చిస్తోంది. ఈ వార్త బయటకు రావటంతో నిన్న మార్కెట్లో CG పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ షేర్లు 20 శాతం పెరిగి రూ.469కి చేరుకున్నాయి.

సెమీకండక్టర్ చిప్‌ల కోసం OSAT అనే అసెంబ్లీ, టెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు కోసం సాంకేతిక భాగస్వామి కోసం వెతకడం కూడా ప్రారంభించినట్లు కంపెనీ ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్‌లో తెలిపింది. ఇప్పటికే ఈ రంగంలో పెట్టుబడుల గురించి టాటా గ్రూప్, వేదాంత గ్రూప్ కీలక ప్రకటనలు చేశాయి. హెడ్‌ఫోన్ల నుంచి ఆటోమొబైల్స్ వరకు అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చిప్స్ ఉపయోగం పెరగటంతో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఓపెన్ ఏజ్ సామ్ ఆల్ట్‌మాన్ AI సాంకేతికత కోసం కొత్త చిప్‌ను రూపొందించడం ప్రారంభించాడు.
2026 నాటికి భారతదేశంలో సెమీకండక్టర్ పరిశ్రమ సుమారు 63 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రస్తుతం అంచనాలు ఉన్నాయి. దీనిలో భాగస్వామిగా మారాలను మురుగప్ప గ్రూప్ చూస్తుండటంతో తాజా పెట్టుబడి నిర్ణయాన్ని ప్రకటించింది. 1940 నుంచి మురుగప్ప గ్రూప్ కేవలం ట్యూబ్, సైకిల్, వ్యవసాయ ఎరువులు, రసాయనాలు, చక్కెర, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో వ్యాపారాలను కొనసాగిస్తోంది. 1990ల తర్వాత ఐటీ, విద్యుత్, ఆటోమొబైల్, టెలికాం రంగాల్లోకి కూడా ప్రవేశించింది. తాజాగా దీని చూపు బంగారు భవిష్యత్తు ఉన్న సెమీకండక్టర్ల రంగంపై పడిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications