Ambani Wedding: అంగరంగ వైభవంగా జరిగిన అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలో అనుకోని సంఘటన జరిగింది. ఈ క్రమంలో ముంబై పోలీసులు ఇద్దరు ఏపీకి చెందిన వ్యక్తులను అరెస్ట్ చేశారు.
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహ వేదిక అయిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లోకి శనివారం ఆహ్వానం లేకుండా దొంగచాటుగా ప్రవేశించటానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. సెలబ్రిటీల నుంచి పొలిటికల్ ప్రముఖులు వివిఐపీలు ఎక్కువగా హాజరయ్యే వివాహానికి భారీ బందోబస్తు ఉండగా ముంబై పోలీసులు చొరబాటుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసారు. అయితే వీరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తులను యూట్యూబర్ వెంకటేష్ నరసయ్య అల్లూరి(26), వ్యాపారవేత్తగా చెప్పుకుంటున్న లుక్మాన్ మహ్మద్ షఫీ షేక్(28గా గుర్తించారు. వీరిపై ముంబైలోని బీకేసీ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారు. నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్న ముంబై పోలీసులు నిందితుడిని విడుదల చేశారు. అనంత్ అంబానీ-రాధికల హై ప్రొఫైల్ వివాహానికి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకావడంతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ఏపీకి చెందిన వీరిద్దరూ ఆహ్వాన కార్డులు లేకుండా ఎలా ప్రవేశించారనేది స్పష్టంగా తెలియలేదు.
నిందితులు వేర్వేరు గేట్ల ద్వారా వేదికలోకి ప్రవేశించారని ముంబై పోలీసులు తెలిపారు. పెళ్లి వేడుకలో అనుమానాస్పదంగా కదులుతున్న వారిని భద్రతా సిబ్బంది గమనించి పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. శనివారం ఉదయం వేదికలోకి ప్రవేశించిన యూట్యూబర్ అనుమానాస్పదంగా కదులుతున్నట్లు కనిపించడంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. అయితే మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి ఈసారి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
మెుత్తానికి ప్రశాంతగా పూర్తైన అనంత్ వివాహం.. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో బాలీవుడ్ తారలు, అంతర్జాతీయ సెలబ్రిటీల కోలాహలం మధ్య గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నుంచి రేఖ, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి వారు హాజరయ్యారు. అలాగే క్రీడాకారులు, ప్రముఖ సంగీత విద్వాంసులు, రాజకీయ వ్యాపార ప్రముఖులు ఉన్నారు.


Click it and Unblock the Notifications