భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం, నవంబర్ 17న పెద్ద స్థాయి ఇంధన సంక్షోభం నెలకొంది. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (RCF) ప్రాంగణంలో ఉన్న GAIL ప్రధాన గ్యాస్ పైప్‌లైన్ థర్డ్ పార్టీ కారణంగా దెబ్బతింది. ఈ నష్టం వడాలాలోని మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) సిటీ గేట్ స్టేషన్ (CGS)కి వెళ్లే గ్యాస్ ప్రవాహాన్ని పూర్తిగా దెబ్బతీసింది. వడాలా గేట్‌వే ముంబైకి సిఎన్‌జి సరఫరా అయ్యే కీలక కేంద్రం కాబట్టి, పైప్‌లైన్ పగిలిన వెంటనే నగరమంతా సరఫరా తగ్గి, అనేక CNG స్టేషన్లు పనిచేయకుండా పోయాయి.
ఎంజీఎల్ ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం నుండి పైప్‌లైన్ నష్టం కారణంగా సరఫరా అంతరాయం మొదలైంది. RCF కాంపౌండ్‌లోని ప్రధాన గ్యాస్ పైప్‌లైన్ దెబ్బతినడంతో వడాలా CGSకి గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందని కంపెనీ ప్రకటించింది. అయితే, దేశీయ PNG వినియోగదారుల సరఫరా మాత్రం అంతరాయం లేకుండా కొనసాగుతుందని కూడా MGL స్పష్టం చేసింది.

పైప్‌లైన్ నష్టం కారణంగా ముంబై, థానే, నవీ ముంబై సహా మహానగర ప్రాంతాల్లోని ఎక్కువ శాతం CNG స్టేషన్లు నిలిచిపోయాయి. ప్రజా రవాణా సంస్థలకు ప్రత్యేకంగా సరఫరా చేసే పంపులు కూడా మూతపడ్డాయి. నగరంలో 130-140 CNG స్టేషన్లు ఉండగా, చాలా వరకు ఉదయం నుంచే కార్యకలాపాలను నిలిపివేశాయి.
పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ (ముంబై) అధ్యక్షుడు చేతన్ మోడి మాట్లాడుతూ..సరఫరా ఒత్తిడి పూర్తిగా తగ్గిపోయింది. ఉదయం నుంచే చాలా పంపులు మూసుకోవాల్సి వచ్చింది. మా పంపు కూడా నేను మూసివేశానని తెలిపారు. RCF పైప్‌లైన్ మరమ్మతులకు రోజంతా పట్టవచ్చని ఎంజీఎల్ అధికారులు తమకు తెలియజేశారని ఆయన వివరించారు. సిఎన్‌జి కొరత కారణంగా స్కూల్ బస్సుల కార్యకలాపాలకు కూడా అంతరాయం ఏర్పడింది. స్కూల్ బస్ ఆపరేటర్ల సంఘం నాయకుడు అనిల్ గార్గ్ మాట్లాడుతూ..అనేక బస్సులు ఇంధనం లేకుండా నిలిచిపోయాయి. కొన్ని రూట్లను కలపాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ఆటో డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుఫియాన్ ఖాన్ అనే ఆటో యజమాని మాట్లాడుతూ.. నేను ప్రతిరోజూ సాయంత్రం 5.30కి పని ముగిస్తాను. కానీ ఇప్పుడు క్యూలు చాలా పొడవుగా ఉన్నందున తెల్లవారకముందే ఇంధనం నింపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. CNG దొరక్కపోవడంతో నగర రవాణా వ్యవస్థలో కొరత పెరిగి, ఓలా, ఉబర్ ధరలు గణనీయంగా పెరిగాయి. సాధారణంగా రూ. 400 నుండి రూ. 450 ఉండే మీరా రోడ్-BKC ప్రయాణం ఆదివారం రూ. 600 దాటిందని నివేదికలు తెలియజేశాయి. MGL ప్రతినిధి ప్రకారం.. పైప్‌లైన్ మరమ్మతు పూర్తయిన తర్వాత వడాలా CGSకి సరఫరా తిరిగి వస్తే, నగరమంతా CNG పంపిణీ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. సాయంత్రానికి సరఫరా కొంతవరకు పునరుద్ధరించబడినట్లు కూడా అధికారులు తెలిపారు.


Click it and Unblock the Notifications