Reliance Industries: హురున్ యొక్క అత్యంత విలువైన కంపెనీల జాబితా ప్రకారం భారతదేశంలోని టాప్ 500 కంపెనీల్లో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అత్యంత విలువైన ప్రైవేట్ రంగ సంస్థగా నిలిచింది.
తాజాగా విడుదల చేసిన జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.16.3 లక్షల కోట్ల విలువతో మెుదటి స్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.11.8 లక్షల కోట్లతో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.9.4 లక్షల కోట్లతో ఉన్నాయి. దీనికి ముందు 2022లో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వరుసగా రూ.17.3 లక్షల కోట్లు, రూ.11.6 లక్షల కోట్లు, రూ.8.3 లక్షల కోట్లతో మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి.

ఇదే క్రమంలో హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్‌లోని ఎనిమిది కంపెనీలు తమ విలువను 52 శాతం లేదా రూ.10,25,955 కోట్లు తగ్గాయి. కంపెనీల ఉమ్మడి విలువ ఇప్పుడు రూ.9.5 లక్షల కోట్లుగా ఉంది. అలాగే గత ఆరు నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ 5.1 శాతం లేదా రూ.87,731 కోట్లు తగ్గినట్లు నివేదిక పేర్కొంది. ఇక టీసీఎస్ మొత్తం విలువ స్వల్పంగా 0.7 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ విలువ 12.9 శాతం మేర పెరిగాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచడం, సెంట్రల్ బ్యాంకులు తమ కీలక రుణ రేట్లను పెంచడం, స్టార్టప్‌లకు ఫండింగ్ వింటర్ వంటి కారణాలు వ్యాపారాలను ప్రభావితం చేసినట్లు హురున్ ఇండియా ఎండీ, చీఫ్ రీసెర్చర్ అనస్ రెహమాన్ జునైద్ పేర్కొన్నారు. టాప్ 10 కంపెనీల మొత్తం విలువ రూ.71.4 లక్షల కోట్ల వద్ద స్థిరంగా ఉంది. ఇది భారతదేశ GDPలో 37 శాతానికి సరిసమానమైనది.
అదానీ టోటల్ గ్యాస్ తన విలువలో 73.8 శాతం (రూ.2,92,511 కోట్లు) కోల్పోయి ఏప్రిల్ 30 నాటికి రూ.1,03,734 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో అదానీ ట్రాన్స్‌మిషన్ 69.2 శాతం (రూ.2,58,493 కోట్లు), అదానీ గ్రీన్ ఎనర్జీ 54.7 శాతం (రూ.1,82,306 కోట్లు) మేర విలువ క్షీణించింది. అలాగే అదానీ గ్రూప్‌లోని మొదటి ఎనిమిది కంపెనీల ఉమ్మడి విలువ రూ.9.5 లక్షల కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications