రిలయన్స్ ఎఫెక్ట్: రూ.5 లక్షల కోట్లు దాటిన అంబానీ కుటుంబం ఆస్తులు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారం రూ.10,00,000 కోట్ల మార్క్‌కు చేరుకుంది. దీంతో ఈ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ ఆస్తులు కూడా ఏకంగా రూ.5 లక్షల కోట్లకు (70 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయి. రూ.10 లక్షల కోట్ల మార్క్ చేరుకున్న తొలి భారత కంపెనీగా రిలయన్స్ రికార్డ్ సృష్టించింది. షేర్ ధర రూ.1,582కి చేరుకొని, కంపెనీ వ్యాల్యు రూ.10,01,270 కోట్లు దాటింది. దీంతో ముఖేష్ కుటుంబ ఆస్తులు కూడా పెరిగాయి.

భారీగా పెరిగిన ముఖేష్ ప్యామిలీ సంపద
ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో (RIL) 50.05 శాతం షేర్లు ఉన్నాయి. దీంతో కంపెనీ వ్యాల్యూ పెరగడంతో పాటు ముఖేష్ ఫ్యామిలీ ఆస్తులు కూడా పెరిగాయి. తద్వారా రూ.5 లక్షల కోట్ల సంపదకు చేరుకొని వ్యక్తిగతంగాను ముఖేష్ ఫ్యామిలీ మరో రికార్డ్ సృష్టించింది. గత 15 వారాల్లోనే రిలయన్స్ షేర్లు భారీగా పుంజుకున్నాయి. దీంతో వారి ఆస్తులు కూడా అలాగే పెరిగాయి.

220 శాతం పెరిగిన RIL ఆదాయం
సెప్టెంబర్ క్వార్టర్ నాటికి ముఖేష్ కుటుంబం రిలయన్స్‌లో మరో 2.76 శాతం ప్రమోటర్ షేర్ హోల్డింగ్‌ను పెంచుకోవడం ద్వారా 50.05 శాతానికి చేరుకుంది. గత అయిదేళ్ల కాలంలో షేర్ వ్యాల్యూ రూ.493 నుంచి రూ.1,582కు పెరిగింది. అంటే ఈ పెరుగుదల 220 శాతానికి పైగా పెరిగింది. అదే సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వ్యాల్యూ రూ.1,324 నుంచి రూ.2,084కు 57 శాతం మాత్రమే పెరిగింది.

సెన్సెక్స్ దూకుడు 44 శాతం
HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.6.97 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్, టీసీఎస్ తర్వాత ఎం-క్యాప్‌లో HDFC బ్యాంకు మూడో స్థానంలో ఉంది. దీని వ్యాల్యూ ఈ అయిదేళ్లలో 164 శాతం పెరిగింది. హిందూస్థాన్ యూనిలీవర్ రూ.4.54 లక్షల కోట్లతో 168 శాతం పెరిగింది. అయితే సెన్సెక్స్ బెంచ్ మార్క్ మాత్రం ఇదే సమయంలో 44 శాతమే పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనూహ్యంగా పుంజుకోవడానికి జియోతో పాటు ఆరామ్‌కోతో కలవడమని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications