Mukesh Ambani: మెట్రోని చేజిక్కించుకుంటున్న అంబానీ.. భారీ డీల్ కు సై అంటూ సిగ్నల్..
Mukesh Ambani: దేశంలోని ప్రజలకు చేరువయ్యేందుకు రిలయన్స్ గ్రూప్ ఇటీవలి కాలంలో చేయనిపని లేదనటం అతిశయోక్తి కాదు. వరుసగా కంపెనీలను కొనటం, కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించటం సర్వసాధారణం అయిపోయింది. ముఖేష్ అంబానీ తన వారసులకు కంపెనీల పగ్గాలు అప్పగించిననాటి నుంచి దూకుడు మరింతగా పెరిగిందనే చెప్పుకోవాలి.

మెట్రో పై కన్ను..
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జర్మన్ రిటైలర్ మెట్రో AG క్యాష్ & క్యారీ వ్యాపారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ.4,060 కోట్లను వెచ్చించేందుకు సిద్ధంగా ఉంది. ఈ డీల్ లో 31 హోల్ సేల్ అవుట్ లెట్లు, ల్యాండ్ బ్యాంక్ తో పాటు ఇతర ఆస్తులు సైతం ఉన్నాయని సమాచారం. ఇది రిలయన్స్ రిటైల్ విస్తరణకు మరింతగా సహాయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చర్చలు పూర్తి..
అయితే ఈ డీల్ కు సంబంధించి రిలయన్స్ గ్రూప్, మెట్రో యాజమాన్యం మధ్య గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజాగా గతవారం రిలయన్స్ ఆఫర్ ను మెట్రో మాతృ సంస్థ అంగీకరించినట్లు సమాచారం.మెట్రో సంస్థ దేశంలోని రిటైలర్లు, కిరాణా దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరర్లు, కార్పొరేట్లు, కంపెనీలకు హోల్ సేల్ ధరలకే సామాగ్రిని అమ్ముతుంది. ఈ ఒప్పందం తర్వాత దేశం నుంచి తక్కువ మార్జిన్ B2B వ్యాపారం నుండి నిష్క్రమించిన రెండవ సంస్థగా మెట్రో నిలవనుంది.

దేశంలో వ్యాపారం..
METRO క్యాష్ & క్యారీ 2003లో భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న కంపెనీకి భారత్ లో 31 కేంద్రాలు ఉన్నాయి. బెంగళూరులో ఆరు, హైదరాబాద్‌లో నాలుగు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, జలంధర్, జిరాక్‌పూర్, అమృత్‌సర్, విజయవాడ, అహ్మదాబాద్, సూరత్, ఇండోర్, లక్నో, మీరట్, నాసిక్, ఘజియాబాద్, తుమకూరు, విశాఖపట్నం, గుంటూరు, హుబ్లిలలో ఔట్ లెట్స్ కలిగి ఉంది.

అత్యుత్తమ కంపెనీ..
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డును సృష్టించింది. RIL దేశంలో అత్యుత్తమ కంపెనీగా పరిగణించబడుతుంది. ఇదే క్రమంలో ఉపాధిని ఇవ్వటంలో ప్రపంచంలోని టాప్-20 అత్యుత్తమ కంపెనీలలో రిలయన్స్ పేరు ఎంపికైంది. ఫోర్బ్స్ 2022 ప్రపంచంలోని ఉత్తమ ఉద్యోగార్ధుల ర్యాంకింగ్ ప్రకారం రిలయన్స్ 20వ స్థానాన్ని దక్కించుకుంది.


Click it and Unblock the Notifications