Reliance Industries: మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసిన అంబానీ.. తాజా వెనకడుగు అందుకే..!!
Mukesh Ambani: దేశంలోని ఇంధన తయారీ రంగంలో దిగ్గజ కంపెనీగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కంపెనీ పునరుత్పాదక ఇంధన అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.
ఈ మెగా వ్యాపార ఆలోచనను నేరుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్వహిస్తుందని మే 2022లో అంబానీ ప్రకటించారు. ఈ క్రమంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ వ్యాపారాన్ని మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో విలీనం చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు అంబానీ స్టాక్ ఎక్స్ఛేంజీకి అందించిన వివరాల్లో స్పష్టం చేశారు.

అంబానీ విలీన నిర్ణయం చాలా కాలంగా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ముంబై బెంచ్ వద్ద పెండింగ్ లో ఉన్న తరుణంలో తాజా నిర్ణయం వెలుగులోకి వచ్చింది. న్యూ ఎనర్జీ, ఎనర్జీ వ్యాపారాలను, వాటిలో పెట్టుబడి విధానాన్ని సమీక్షించి విలీన ఆలోచనను రద్దు చేసుకుంటున్నట్లు రిలయన్స్ గ్రూప్ తన ఫైలింగ్స్‌లో వెల్లడించింది.
2021లో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. మూడేళ్ల కాలంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో రిలయన్స్ గ్రూప్ రూ.75,000 కోట్లను పెట్టుబడి పెడుతుందని ప్రకటించారు. ఇందులో రూ.60,000 కోట్లను గుజరాత్ జామ్‌నగర్ లో నాలుగు గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు ఉపయోగిస్తామన్నారు. అలా ఫొటో ఓల్టాయిక్ సెల్స్, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రోలైసిస్, బ్యాటరీలు, ఫ్యూయల్ సెల్స్ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని తెలిపారు. మిగిలిన సొమ్మును వ్యాల్యూ చైన్స్, భాగస్వామ్యాలకు వినియోగిస్తామన్నారు.
2022 ఆర్థిక సంవత్సరంలో యాన్యువల్ మీటింగ్ లో మాట్లాడుతూ న్యూ ఎనర్జీ విభాగం రానున్న 5-7 ఏళ్ల కాలంలో గ్రూప్ లోని అన్ని ఇతర వ్యాపారాల కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేయగలదని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఈ రంగంలో రిలయన్స్ గ్రూప్ చేస్తున్న పెట్టుబడులు దేశంలోని ఎనర్జీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉంటుందని, వృద్ధికి దోహదపడుదుందని వెల్లడించారు.


Click it and Unblock the Notifications