అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక వల్ల అత్యధిక ధనవంతుల జాబితా నుంచి గౌతమ్ అదానీ ఒక్కో మెట్టూ కిందకు పడిపోతున్నారు. ఇదే సమయంలో రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ మెల్లమెల్లగా తన స్థానాన్ని మెరుగుపరచుకున్నారు. గత 24 గంటల్లో ఆయన సంపద 28 వేల కోట్లకు పైగా పెరిగింది. దీనితో ఏకంగా ఫోర్బ్స్ టాప్-10 బిలియనీర్ల జాబితాలో స్థానం దక్కించుకున్నారు.

తిరిగి టాప్-10 లోకి:
భారత మేటి వ్యాపారవేత్త, రిలయన్స్ సంస్థల అధిపతి ముకేష్ అంబానీ తిరిగి ప్రపంచ టాప్-10 ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు. గతంలో 12వ స్థానానికి పరిమితం కాగా.. ఒకేసారి మూడు మెట్లు పైకి ఎగబాకి 85.4 బిలియన్ డాలర్ల సంపదతో 9వ స్థానానికి చేరారు. మరోవైపు ఆసియాలో అత్యంత ధనవంతుడిగానూ ఆయన కొనసాగుతున్నారు.

అంబానీ అలా-అదానీ ఇలా:
రిలయన్స్ స్టాక్ భారీగా లాభపడటంతో గత 24 గంటల్లో అంబానీ ఆస్తులు దాదాపు 3.5 బిలియన్ డాలర్లకు పైగా పెరిగాయి. అంటే ఒక్కరోజులోనే దాదాపు 28 వేల కోట్లు సంపద పెంచుకుని ఈ రికార్డు సాధించారన్నమాట. అయితే ఇదే సమయంలో అదానీ గ్రూపులోని కొన్ని కంపెనీలు పెద్ద ఎత్తున నష్టాల్లో కొనసాగాయి. తద్వారా 24 గంటల్లో గౌతమ్ అదానీ సంపద రూ.17,392 కోట్లు ఆవిరైంది. కాగా ప్రస్తుతం 52.2 బిలియన్ డాలర్ల ఆస్తులతో 24వ స్థానంలో కొనసాగుతున్నారు.

ఇతర సంపన్నులు వీళ్లే..
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా బెర్నార్డ్ ఆర్నాల్డ్ కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ 215.9 బిలియన్ డాలర్లు. కాగా 196.5 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ రెండవ స్థానం, 122.9 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్ మూడవ స్థానంలో ఉన్నారు. స్టాక్ మార్కెట్ దిగ్గజం వారెన్ బఫెట్ 108.4 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ 106.7 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నారు.


Click it and Unblock the Notifications