నరేంద్ర మోడీ ప్రభుత్వం వివిధ రంగాల్లోని ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ స్పందించారు. ప్రయివేటీకరణ వల్ల అవకాశాలు సునామీలా తన్నుకు వస్తాయని అభిప్రాయపడ్డారు. ఇది ఎంటర్‌ప్రెన్యూవర్స్‌కు ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రస్తుతం దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు చాలా ఉన్నాయన్నారు. ప్రధాని మోడీ ప్రయివేటు రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతతో ఈ అవకాశాలు సునామీలా వస్తాయన్నారు.

మోడీ ప్రయివేటీకరణను స్వాగతించాలి
వర్చువల్ 22వ ఎంటర్‌ప్రెన్యూవర్స్ ఆఫ్ ది ఇయర్-ఇండియా(EOY) 2020 అవార్డు కార్యక్రమంలో ముఖేష్ అంబానీ మాట్లాడారు. ప్రయివేటు రంగం భారత అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందని, ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని స్వాగతించాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థను మార్చడానికి కొత్త టెక్నాలజీ విప్లవాత్మకతను భారత్ కలిగి ఉందన్నారు. చిన్న, మధ్య, పెద్ద వ్యాపారాలు.. మంచి జీవన ప్రమాణాల కోసం 1.3 బిలియన్ల ప్రజల అవసరాలు, ఆకాంక్షలను తీర్చడానికి అవకాశం కలిగి ఉన్నాయన్నారు.

దేశీయంగా.. అంతర్జాతీయంగా అవకాశాలు
క్లీన్ ఎనర్జీ, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, లైఫ్ సెన్సెస్, బయోటెక్నాలజీ వంటి రంగాలతో పాటు వ్యవసాయ రంగం, పారిశ్రామిక, సేవా రంగాలు పరివర్తన చెంది అద్భుత అవకాశాలు అందిస్తున్నాయని ముఖేష్ అంబానీ అన్నారు. భారతీయ పారిశ్రామికవేత్తలు ఇప్పుడు మన మార్కెట్ అవసరాలను అత్యంత పోటీ వ్యయంతో తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఇది భారతీయ పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ రంగానికి తీసుకు వెళ్లడానికి అవకాశాలు తెరుస్తుంది. కాబట్టి భారతీయ పారిశ్రామికవేత్తలకు ద్వంద్వ అవకాశాలు ఉన్నాయన్నారు. తొలుత దేశీయ మార్కెట్లు, ఆ తర్వాత ప్రపంచ మార్కెట్ పైన దృష్టి సారించాలన్నారు.

వారే ఇంధనం
భారత అభివృద్ధికి అతిపెద్ద ఇంధనం ఎంటర్‌ప్రెన్యూవర్స్ అన్నారు. స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూవర్స్ తప్పనిసరిగా పరిమిత వనరులతో పని చేయడానికి సిద్ధంగా ఉండాలని, అయితే అపరిమిత లక్ష్యాలు కలిగి ఉండాలన్నారు. కాగా, ప్రపంచ టాప్ 10 కుబేరుల్లో ప్రస్తుతం అంబానీ ఉన్నారు.


Click it and Unblock the Notifications