టాప్ 10 నుండి ముఖేష్ అంబానీ ఔట్.. అందుకే: 2020 రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండుగే!
భారత, ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రపంచ టాప్ 10 ధనవంతుల జాబితాలో కొద్ది కాలం మాత్రమే ఉన్నారు. కొద్ది నెలల క్రితం ప్రపంచ పదిమంది కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్న అంబానీ.. ఇప్పుడు కిందకు వచ్చారు. పెట్టుబడులు, జియో ప్రభావం వంటి కారణాలతో 2020 మధ్యలో టాప్ 10లోకి వచ్చారు. అయితే ఈ ఏడాది చివరి నాటికి ఆయన ఆస్తులు తగ్గాయి. ప్రారంభంలో 90 బిలియన్ డాలర్ల నుండి ఇప్పుడు 76.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది.

లక్ష కోట్లు ఆవిరి
ముఖేష్ అంబానీ 2020 ప్రథమార్థంలో 90 బిలియన్ డాలర్లు లేదా రూ.6.62 లక్షల కోట్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో 4వ స్థానానికి వచ్చారు. ఇప్పుడు 5.63 లక్షల కోట్లతో (76.5 బిలియన్ డాలర్లు) 11వ స్థానానికి పడిపోయారు. ఆయన సంపద ఈ కాలంలో దాదాపు లక్ష కోట్లు ఆవిరైంది. ఒరాకిల్ కార్పొరేషన్ అధినేత లారీ ఎల్లిసన్, సెర్చింజన్ గూగుల్ ఫౌండర్ బ్రిన్ కంటే వెనుబడ్డారు.

అందుకే ముఖేష్ ఆస్తి డౌన్
ఇటీవల ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తులను కొనుగోలు చేయనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. అప్పటికే రిలయన్స్ అనుబంధ సంస్థల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. దీంతో రిలయన్స్ షేర్ ఓ సమయంలో ఆల్ టైం 2,370ని తాకింది. ఫ్యూచర్ గ్రూప్‌ను కొనుగోలు చేయాలనే రిలయన్స్ నిర్ణయాన్ని అమెజాన్ సవాల్ చేసింది.
ఈ సమయంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. అమెజాన్ జోక్యంతో ఫ్యూచర్ గ్రూప్‌తో డీల్ రిస్క్‌లో పడటం పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగించింది. దీంతో గత రెండు నెలలుగా షేర్ ఎక్కువగా రూ.2000కు దిగువనే ఉంది. డీల్ రిస్క్‌లో పడినప్పటి నుండి దాదాపు 16 శాతం పతనమైంది. గురువారం రిలయన్స్ షేర్ రూ.1994.15వద్ద స్థిర పడింది.

2020లో రిలయన్స్ దూకుడు
ఫ్యూచర్ గ్రూప్ డీల్ నేపథ్యంలో అమెజాన్ జోక్యం కారణంగా గత రెండు నెలలుగా ఈ స్టాక్ భారీగా పతనమైనప్పటికీ, 2020లోనే రిలయన్స్ స్టాక్ భారీగా పెరిగింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరుతో 33 శాతం ఎగిసింది. మార్కెట్ విలువ రూ.3 లక్షల కోట్లకుపైగా పెరిగింది. గత పాతికేళ్లలో సంస్థ సాధించిన మార్కెట్ విలువలో ఈ మొత్తం సగానికి సమానం కావడం గమనార్హం. మార్చి 1995 నుండి మార్చి 2020 మధ్య రిలయన్స్ ఎం-క్యాప్ రూ.6.3 లక్షల కోట్లకు పెరిగింది. అయితే అప్పటినుంచి ఇప్పటిదాకా మరో రూ.3 లక్షల కోట్లకు పైగా ఎగిసింది. ఇప్పుడు సంస్థ మార్కెట్ క్యాప్ రూ.12 లక్షల కోట్ల వరకు ఉంది.


Click it and Unblock the Notifications