Mukesh Ambani: అంబానీ ఫైనాన్స్ వ్యాపారం బడా ప్లాన్.. సీక్రెట్ రివీల్ చేసిన సీఈవో..
Jio Financial: గడచిన కొన్నేళ్లుగా ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ హుషారుగా వ్యాపారాల విస్తరణ చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఏజీఎంలోనూ రిటైల్, జ్యూవెలరీ సహా మరిన్ని వ్యాపారాలను విస్తరించాలనే ప్లాన్స్ గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే మరోపక్క ముఖేష్ అంబానీ బయటకు పొక్కకుండా తన ఫైనాన్స్ వ్యాపారాన్ని సైతం వేగంగా విస్తరించేందుకు ప్రణాళికలను రచిస్తున్నారు. అవును అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ జియో ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసే భారీ ప్రకటన వెలువడింది. కంపెనీ ఇండియాలో వేగంగా వృద్ధి చెందుతున్న హోమ్ లోన్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు చివరి దశలో ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్ గా ప్రారంభించబడిందని స్పష్టం చేసింది. త్వరలోనే ఆస్తులపై రుణాలు, సెక్యూర్డ్ లోన్స్ ఉత్పత్తులను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఫైనాన్స్ రంగంలోని ఇతర కంపెనీలకు గట్టి పోటీని అందించగలదని నిపుణులు భావిస్తున్నారు.

శుక్రవారం జరిగిన ఏజీఎంలో వాటాదారులను ఉద్దేశించి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో హితేష్ సేథియా మాట్లాడుతూ.. తాము ప్రయోగాత్మకంగా ప్రారంభించిన గృహ రుణాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చివరి దశలో ఉన్నట్లు వెల్లడించారు. జియో ఫైనాన్స్ లిమిటెడ్ ఇప్పటికే సురక్షిత రుణ ఉత్పత్తులైన.. సప్లై చైన్ ఫైనాన్సింగ్, మ్యూచువల్ ఫండ్స్‌పై రుణాలు, ఎక్విప్‌మెంట్ ఫైనాన్సింగ్ కోసం ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్ వంటి రుణ ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెట్టిందని సమావేశంలో చెప్పారు. ఇప్పటికే కంపెనీ ఆర్బీఐ నుంచి కీ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీగా పనిచేయడానికి అవసరమైన అనుమతులను పొందింది.
శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఒక్కోటి రూ.322 స్థాయిల వద్ద ప్రయాణాన్ని ముగించాయి. ఏప్రిల్ 2024లో కంపెనీ షేర్ల ధర రూ.395గా ఉన్న సంగతి తెలిసిందే. ఇది 52 వారాల స్టాక్ గరిష్ఠ ధర అని చెప్పుకోవచ్చు. జూన్ త్రైమాసికంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లాభం 6 శాతం తగ్గి రూ.313 కోట్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది మార్కెట్లో జాబితా అయిన అంబానీ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్ బ్రోకింగ్, పేమెంట్స్ బ్యాంక్, పేమెంట్ ప్లాట్‌ఫారమ్ వంటి అనేక సేవలను ప్రస్తుతం అందిస్తోంది.


Click it and Unblock the Notifications