Mukesh Ambani: డబ్బు కుమ్మరిస్తున్న అంబానీ.. స్టార్టప్‌కు బూస్టర్ డోస్.. పూర్తి వివరాలు..
Mukesh Ambani: బిజీ లైఫ్‌లో అన్ని సేవల కోసం ఆన్ లైన్ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు నేటి తరం ప్రజలు. దీనిని అందిపుచ్చుకునేందుకు రిలయన్స్ గ్రూప్ అధినేక అంబానీ ఇప్పటికే అనేక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు.
బెంగళూరుకు చెందిన బ్లింకిట్, జెప్టోలకు ప్రత్యర్థి డన్జోలో దేశీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, ఇషా అంబానీలు పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది జనవరిలో దాదాపు 25 శాతం వాటాను రూ.1,641 కోట్లకు రిలయన్స్ గ్రూప్ దక్కించుకుంది. ఇటీవలే డన్జోలో అతిపెద్ద పెట్టుబడిదారు అయిన రిలయన్స్ రిటైల్‌తో తాజా చర్చలు జరిపింది. తాజాగా కంపెనీ నగదు క్రాష్ ఎదుర్కొంటుండగా.. రూ.164 కోట్ల పెట్టుబడిని అందించాలని చూస్తోందని వెల్లడైంది.

కిరాణా సరుకుల డెలివరీ వ్యాపారంలో ప్రస్తుతం Dunzo, Blinkit, Zeptoలు వేగంగా వృద్ధిని సాధించేందుకు పోటీపడుతున్నాయి. 2014లో కబీర్ బిస్వాస్, అంకుర్ అగర్వాల్, దల్వీర్ సూరి, ముకుంద్ ఝా లు Dunzo స్టార్టప్ కంపెనీని స్థాపించారు. ఇప్పటికే వారు అనేక రౌండ్లలో నిధులను సేకరించారు. స్టార్టప్ గూగుల్, లైట్‌బాక్స్ వంటి దిగ్గజాల నుండి ఆసక్తిని పొందింది. ఇటీవల కంపెనీ వందలాది మంది ఉద్యోగులను తొలగించటంతో వార్తల్లో నిలిచింది. అలాగే మిగిలిన ఉద్యోగులకు జీతాలను ఆలస్యం చేస్తోంది.
ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కంపెనీ తన వినియోగదారు వ్యాపారాన్ని తగ్గించుకుని, B2B ఆఫర్ అయిన మర్చంట్ సర్వీసెస్‌పై దృష్టి పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెక్‌డొనాల్డ్స్, లైషియస్, థియోబ్రోమా సహా కొన్ని పెద్ద క్లయింట్‌లను కలిగి ఉంది. 2022 జనవరిలో రిలయన్స్ రిటైల్ చివరిగా పెట్టుబడి పెట్టే సమయంలో స్టార్టప్ కంపెనీ విలువ 775 మిలియన్ డాలర్లుగా ఉంది.


Click it and Unblock the Notifications