ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరో మెట్టు ఎక్కారు. యూరోప్‌కు చెందిన ఎల్వీఎంహెచ్ చైర్మన్ బెర్నార్డ్ అర్నాల్ట్‌ను వెనక్కి నెట్టి రిలయన్స్ అధినేత నాలుగోస్థానంలోకి వచ్చారు. టాప్ 10లోకి చేరిన కొద్ది రోజుల్లోనే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నికర వ్యాల్యూ 80.6 బిలియన్ డాలర్లు(6.04 లక్షల కోట్లు)కు చేరుకుంది.

అర్నాల్ట్‌ను దాటేసిన ముఖేష్ అంబానీ
ఈ ఏడాది ముఖేష్ అంబానీ సంపద 22 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. మరోవైపు బెర్నార్డ్ అర్నాల్ట్‌కు చెందిన కంపెనీ షేర్లు పడిపోవడంతో ఆయన సంపద 25.1 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. దీంతో నికర సంపద 80.2 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. కరోనా మహమ్మారి సమయంలో రిలయన్స్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫాంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు, రైట్స్ ఇష్యూతో భారీగా సమీకరణ చేశారు. కరోనా కాలంలో రిలయన్స్ షేర్లు పెద్ద ఎత్తున పెరిగాయి.

ముఖేష్ కంటే ముందు ముగ్గురే.. ఎవరి ఆస్తులు ఎంత?
ముఖేష్ అంబానీ కంటే ముందు జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్ .. ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారు. నాలుగో స్థానంలోకి ముఖేష్ అంబానీ నిలిచారు. ఆ తర్వాత బెర్నార్డ్ అర్నాల్ట్, వారెన్ బఫెట్, స్టీవ్ బాల్మర్, లారీ పేజ్, సెర్జీ బ్రిన్, ఎలాన్ మస్క్ ఉన్నారు. మార్చి నెల నుండి రిలయన్స్ షేర్లు దాదాపు 145 శాతం పెరిగాయి. రిలయన్స్‌ను అప్పులేని సంస్థగా మార్చడంతో ఈ కంపెనీ షేర్లు పెరిగాయి.
జెఫ్ బెజోస్ - $187B
బిల్ గేట్స్ - $121B
మార్క్ జుకర్‌బర్గ్ - $102B
ముఖేష్ అంబానీ - $80.6B
బెర్నార్డ్ అర్నాల్ట్ - $80.2B
వారెన్ బఫెట్ - $79.2B
స్టీవ్ బాల్మర్ - $76.4B
లారీ పేజ్ - $71.3B
సెర్జీ బ్రిన్ - $69.1B
ఎలాన్ మస్క్ - $68.7B

అప్పుడే 3వ స్థానంలోకి
ముఖేష్ అంబానీ ఈ-కామర్స్‌పై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రపంచ టాప్ టెక్ దిగ్గజాలు పెట్టుబడులు పెడుతున్నాయి. టాప్ 10లో చేరిన కొద్దివారాల్లోనే ముఖేష్ నాలుగో స్థానానికి చేరుకున్నారు. మూడో స్థానం అంత సులువు కాదని, ఎందుకంటే ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ నికర సంపద 102 బిలియన్ డాలర్లుగా ఉందని చెబుతున్నారు. జుకర్ బర్గ్ ఇటీవలే 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరారు. ఇద్దరి మధ్య అంతరం 20 బిలియన్ డాలర్ల పైనే. ఈ ఏడాదిలో 22 బిలియన్ డాలర్లు ఆదాయం పెంచుకుంటే మాత్రమే 3వ స్థానంలోకి వస్తారు. గత కొన్ని నెలలుగా ముఖేష్ అంబానీకి అన్ని పరిణామాలు అనుకూలించాయి. ఇకముందు కూడా అనుకూలించాల్సి ఉంది. చమురు డిమాండ్ పెరగాలి. మరిన్ని వాటాల విక్రయాలు జరగాలి. అప్పుడు సాధ్యం కావొచ్చు.


Click it and Unblock the Notifications