Ambani News: ముఖేష్ అంబానీ కంపెనీ దివాలా..!! 75 శాతం ఉద్యోగులు ఇంటికే..
Dunzo Layoff: దేశీయంగా గడచిన కొన్ని నెలలుగా రిటైల్, క్విక్ కామర్స్ వ్యాపారం పెద్ద మార్పులను చూస్తోంది. ఇందులో జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటి పెద్ద ఆటగాళ్లు మాత్రమే నిలదొక్కుకుని తమ వ్యాపారాలను ముందుకు తీసుకెళుతున్నారు. పైగా ప్రస్తుతం ఈ వ్యాపారంలో కంపెనీలు ఎక్కువ క్యాష్ బర్న్ చూస్తున్నాయి.
ఈ పోటీ సుడిగుండంలో భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీ పెట్టుబడి పెట్టిన కంపెనీ సైతం చిక్కుకుని చిత్తైనట్లు ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. దేశంలోని అతిపెద్ద రిటైల్ కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ రిటైల్ పెట్టుబడులను కలిగిన ఉన్న స్టార్టప్ కంపెనీ డన్జో తన ఉద్యోగుల్లో 75% మందిని తొలగించినట్లు సమాచారం. క్విక్ కామర్స్ వ్యాపారంలో ఉన్న డన్జో ప్రారంభంలో గొప్ప వృద్ధిని, కస్టమర్లను పొందింది. అయితే మార్కెట్లోని ఇతర ఆటగాళ్లలో పోటీపడటంలో విఫలమైంది. కంపెనీలో రిలయన్స్ రిటైల్, గూగుల్ సహా మరికొన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి.

గడచిన కొన్ని త్రైమాసికాలుగా కంపెనీ నిధులను సమకూర్చుకోవటం కోసం అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఫండింగ్ వింటర్ కారణంగా అవసరమైన మేరకు నిధులను సమకూర్చుకోవటంలో సఫలీకృతం కాలేదని చెప్పుకోవచ్చు. గత మూడేళ్లుగా డన్జో పతనం నుంచి తిరిగి కోలుకుని వ్యాపారాన్ని గాడిన పెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కంపెనీ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ పలు దఫాలుగా ఉద్యోగుల తొలగింపులను వెళ్లింది. ఒకానొక దశలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని గడ్డు పరిస్థితులను కంపెనీ చూసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కంపెనీ ప్రస్తుతం తన మెుత్తం ఉద్యోగుల్లో 75 శాతం మందిని తొలగించిందనే వార్త పెద్ద చర్చకు దారితీసింది. ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లో 150 లేఆఫ్‌ల తరువాత ప్రస్తుత తొలగింపులో 50 మంది ఉద్యోగులు మాత్రమే మిగిలి ఉన్నారని తెలుస్తోంది. లేఆఫ్స్ వెనుక కారణాలను పరిశీలిస్తే.. ఖర్చులను నియంత్రించడానికి నిధులను సేకరించడం, ఉద్యోగులకు బాకీ ఉన్న పెండింగ్ వేతనాల చెల్లింపులు, డీలర్లకు ఉన్న బకాయిల చెల్లింపులతో పాటు పెరుగుతున్న అప్పులను ఎదుర్కొనేందుకు నిధుల సేకరణ చేయటం కారణాలుగా ఉన్నాయి. అయితే తొలగింపులకు సంబంధించిన వివరాలను స్టార్టప్ తన ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా ఇప్పటికే వెల్లడించిందని సమాచారం.
మెయిల్ ప్రకారం డన్జో తన ఉద్యోగులకు అవసరమైన నిధులు అందిన వెంటనే బకాయి వేతనాలు, జీతభత్యాలు, లీవ్ పే, ఇతర బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఒకానొక సమయంలో 775 మిలియన్ డాలర్లు విలువ కలిగిన కంపెనీ అవసరమైన నిధులను పొందటంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే మెుత్తానికి అంబానీ సపోర్ట్ ఉన్నప్పటికీ కంపెనీ డన్జో తన మనుగడను కొనసాగించటానికి ఇబ్బందులు పడుతోంది.


Click it and Unblock the Notifications