Ambani News: దేశీయ రిటైలింగ్ వ్యాపారంలో ముఖేష్ అంబానీ అతిపెద్ద వ్యాపారాన్ని సంపాదించారు. రిలయన్స్ ఫ్రెష్, రిలయన్స్ స్మార్ట్, జియో మార్ట్, రిలయన్స్ పాయింట్ అంటూ అనేక స్టోర్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసి విక్రయాలు కొనసాగిస్తున్నారు. అయితే ఇషా అంబానీ ఎంట్రీతో పోటీని తారా స్థాయికి తీసుకెళ్లేందుకు అంబానీ ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలో రిలయన్స్ గ్రూప్ ప్రస్తుతం భారతీయ ఎఫ్ఎంసీజీ రంగంలోని పెద్ద వాటాదారులైన ఐటీసీ, అదానీ విల్మార్, కోకాకోలా, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీలను టార్గెట్ చేశారు. వీటి వ్యాపార వాటాలను దక్కించుకునేందుకు రిలయన్స్ తన ఎఫ్ఎంసీజీ వ్యాపార విభాగంలో ఈక్విటీ అండ్ డెట్ రూపంలో ఏకంగా రూ.3,900 కోట్లను పెట్టుబడిగా పెట్టాలని చూస్తోంది. భారీ మూలధన పెట్టుబడి అవసరాలను తీర్చేందుకు వీలుగా.. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బోర్డు జూలై 24న జరిగిన సమావేశంలో నిధులను సేకరించేందుకు ప్రత్యేక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది.

2022లో ప్రారంభమైనప్పటి నుంచి FMCG యూనిట్‌లో రిలయన్స్ అతిపెద్ద మూలధన పెట్టుబడిగా ఇది నిలిచింది. 2023-24లో కంపెనీ తన మొదటి పూర్తి సంవత్సరం కార్యకలాపాలను పూర్తి చేయనుంది. నిధుల సమీకరణకు సంబంధించి ఎలా చేపట్టనున్నారనే స్పష్టతను కంపెనీ ఇంకా ఇవ్వలేదు. RCPL తన హోల్డింగ్ కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నుంచి హక్కుల-ఆధారిత అన్‌సెక్యూర్డ్ జీరో కూపన్ ఐచ్ఛికంగా పూర్తిగా కన్వర్టిబుల్ డిబెంచర్‌ల ద్వారా FY24లో రూ.792 కోట్లను పొందింది. ఇదే మార్గంలో కంపెనీ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.261 కోట్లను సమీకరించింది.
కంపెనీ కన్జూమర్ బ్రాండ్‌ల వ్యాపారంలో భారతదేశం అంతటా ఎక్కువ వినియోగాన్ని పెంచడానికి సరసమైన ధరలకు అధిక నాణ్యత గల ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టిందని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ ఇటీవల జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ AGMలో షేర్‌హోల్డర్లకు తెలిపారు. కంపెనీ తన సొంత బ్రాండ్ల కింద తక్కువ ధరలకే అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తుల విక్రయంపై దృష్టిసారించిన తరుణంలో అనేక కంపెనీలను సైతం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇది రానున్న కాలంలో కంపెనీ ఆదాయాలను భారీగా పెంచేందుకు దోహదపడనుందని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications