Mukesh Ambani: మూడోసారి అంబానీకి బెదిరింపులు.. ఏకంగా రూ.400 కోట్లు డిమాండ్..!!
Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రస్తుతం ముష్కరుల నుంచి భారీగా బెదిరింపులు అందుకుంటున్నారు. ఏకంగా వారం రోజుల వ్యవధిలోనే మూడోసారి చంపేస్తామంటూ మెయిల్ రావటం కలకలం రేపుతోంది.
పైగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మూడుసార్లు ఒకటే మెయిల్ ఐడీ నుంచి అంబానీకి దుండగులు ఈ-మెయిల్స్ పంపారు. అంబానీకి ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ తమకు ఎలాంటి అడ్డంకి కాదని.. ముఖేష్ ను మట్టుబెట్టడానికి ఒక్క స్నైపర్ షూటర్ సరిపోతారంటూ దుండగులు అంబానీకి తాజాగా పంపిన మెయిల్‌లో వార్నింగ్ ఇచ్చారు.

మెుదటి సారి బెదిరింపు మెయిల్ లో రూ.20 కోట్లు డిమాండ్ చేసిన దుండగులు.. రెండవ సారి ఏకంగా రూ.200 కోట్లు చెల్లించాలని కోరారు. అయితే తాజాగా మూడో సారి అంబానీకి పంపిన మెయిల్ లో చంపకుండా వదిలేయాలంటే తమకు రూ.400 కోట్లు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం ముంబై పోలీసులు ముఖేష్ అంబానీకి వచ్చిన బెదిరింపు మెయిల్ ఫేక్ ఈ-మెయిల్ అడ్రస్ ద్వారా పంపారా లేక నిజమైనదేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ-మెయిల్ అడ్రెస్ సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు మెయిల్ ప్రొవైడర్ కంపెనీని సంప్రదించడానికి కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఒకటే మెయిల్ ఐడీ నుంచి హత్య బెదిరింపులు వరుసగా రావటం కొంత ఆందోళన కలిగిస్తోంది. తాము అడిగినంత చెల్లించకుంటే చావు తప్పదంటూ వ్యాపారవేత్తకు వరుస బెదిరింపులు పంపే సాహసం ఎవరు చేస్తున్నారనే ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముంబై పోలీసులు సైతం దీనిపై దర్యాప్తు వేగవంతం చేశారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications