Mukesh Ambani: అంబానీ షేర్లలో లాభాల తుఫాను.. నెలలోనే డబ్బులు త్రిపుల్
Lotus Chocolate Share: ముందు చూపు కలిగిన వ్యాపారవేత్తగా బిలియనీర్ ముఖేష్ అంబానీకి పెట్టింది పేరు. ఆయన ఏదైనా డీల్ చేస్తున్నారంటే భవిష్యత్తులో ఉండే అవకాశాల గురించి ఖచ్చితంగా ఆలోచించే చేస్తుంటారు. అలా గడచిన ఏడాదిలో అనేక కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలో నడుస్తున్న లోటస్ చాక్లెట్ కంపెనీ షేర్ల గురించే. అంబానీ పెట్టుబడుల తర్వాత చాక్లెట్ షేర్లలో బలమైన పెరుగుదల ఉంది. నేడు ఇంట్రాడేలో కంపెనీ షేర్లు ఏకంగా 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.2,484.45కి చేరాయి. దీంతో కంపెనీ షేర్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. గత నెల కాలంలో కంపెనీ షేర్లలో 191 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను నమోదు చేసింది. అయితే కంపెనీ షేర్ల 52 వారాల కనిష్ఠ ధర రూ.213గా ఉంది.

దీర్ఘకాలిక పనితీరును పరిశీలిస్తే.. గత మూడేళ్లలో లోటస్ చాక్లెట్ షేర్లు 6300% పైగా పెరిగాయి. 2021 ఆగస్టు 20న స్టాక్ ధర కేవలం ఒక్కోటి రూ.38.80గా ఉంది. అలాగే గత ఏడాది కాలంలో షేర్లు 713 శాతం పెరిగాయి. దీంతో ఆగస్టు 23, 2023న కంపెనీ షేర్లు రూ.305.75 వద్ద ఉన్న కంపెనీ షేర్ల ధర ప్రస్తుతం భారీ ర్యాలీ తర్వాత రూ.2400 స్థాయికి చేరుకున్నాయి.
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(RCPL) 2023 మే నెలలో టాక్లెట్ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనేది ముఖేష్ అంబానీకి చెందిన అనుబంధ సంస్థ. లోటస్ చాక్లెట్ కంపెనీ ప్రధానంగా చాక్లెట్లు, కోకో ఉత్పత్తులు, ఇతర సారూప్య ఉత్పత్తులను తయారు చేస్తోంది. అంబానీల కిందకు వచ్చిన తర్వాత చాక్లెట్ కంపెనీ వార్షిక లాభం 4700% పెరిగింది. అలాగే కంపెనీ ఆదాయం 337.4 శాతం పెరుగుదలను చూసింది. మెుదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.9.41 కోట్లుగా నమోదైంది. అందకు ముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం కేవలం రూ.20 లక్షలుగా ఉంది. అలాగే క్యూ1లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన రూ.32.21 కోట్ల నుంచి రూ.141.31 కోట్లకు పెరిగింది.


Click it and Unblock the Notifications