గుజరాతీయుల మధ్యే పోటీ: మళ్లీ సంపన్నుడిగా అంబానీ: మెట్టు దిగిన అదానీ
ముంబై: గుజరాత్‌కు చెందిన దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు- ముఖేష్ అంబానీ.. గౌతమ్ అదానీ మధ్య పోటీ తీవ్రమైంది. దేశంలోనే అత్యంత సంపన్న ఇండస్ట్రీయలిస్ట్ అనే ట్యాగ్.. వారి మధ్యే తిరుగుతోంది. నిన్నటి వరకు అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగిన అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత గౌతమ్ అదానీ.. ఇప్పుడు మెట్టు దిగారు. రెండోస్థానానికి దిగజారారు. రెండో స్థానంలో కొనసాగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ ముఖేష్ అంబానీ- అగ్రస్థానానికి ఎగబాకారు. తన స్థానాన్ని తాను మళ్లీ రీగెయిన్ చేసుకున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన షేర్లన్నీ దుమ్మురేపుతుండటమే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్- తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ 99.7 బిలియన్ డాలర్లు. గౌతమ్ అదాని ఆస్తుల విలువ 98.7 బిలియన్ డాలర్లు. 10 బిలియన్ డాలర్ల తేడాతో అంబానీ.. దేశీయ అత్యధిక ధనవంతుల జాబితాలో తన స్థానాన్ని తాను తిరిగి సాధించుకున్నారు.

బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధనవంతుల జాబితాను పరిగణనలోకి తీసుకుంటే ముఖేష్ అంబానీ స్థానం.. ఎనిమిది. ఇదివరకు ఈ స్థానంలో ఉన్న గౌతమ్ అదాని తొమ్మిదో స్థానానికి దిగారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితా మాత్రం దీనికి కాస్త భిన్నంగా ఉంది. ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా ప్రకారం- అంబానీ ఆస్తుల విలువ 104.7 బిలియన్ డాలర్లు. గౌతమ్ అదాని, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ 100.1 బిలియన్ డాలర్లు.
వారిద్దరి కంటే ముందు ఉన్న అపర కుబేరుల జాబితాలో తొలి స్థానంలో ఎలాన్ మస్క్ ఉన్నారు. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన కేంద్రం స్పేస్ఎక్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా అధినేత ఆయన. ఆయన ఆస్తుల విలువ 233.7 బిలియన్ డాలర్లు. రెండో స్థానంలో ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ అర్నాల్ట్-157.0, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్-151.2, బిల్ గేట్స్-129.1, వారెన్ బఫెట్-113.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
వారి తరువాత టాప్ 10 జాబితాలో ముఖేష్ అంబానీ-104.7 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో ఉన్నారు. 100.9 బిలియన్ డాలర్లతో ల్యారీ పేజ్ ఏడోస్థానంలో, ల్యారీపేజ్-100.8, గౌతమ్ అదాని-100.4, సెర్గే బ్రిన్-97.1 బిలియన్ డాలర్లతో ఆ తరువాతి స్థానంలో నిలిచారు.