Reliance: రూ.75,000 కోట్లు పెట్టుబడి ప్రకటించిన అంబానీ.. ఎప్పుడు..? ఎక్కడంటే..?
Mukesh Ambani: భారత వ్యాపార దిగ్గజం, బిలియనీర్ రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ భారీ ప్రకటన చేశారు. రిలయన్స్ రానున్న నాలుగేళ్లలో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
భారీ పెట్టుబడి..
ముకేష్ అంబానీ టెలికాం సేవలు, రిటైల్, న్యూ ఎనర్జీ రంగాల్లో రూ.75,000 కోట్లను ఇన్వెస్ట్ చేస్తుందని తెలిపారు. ఈ మెుత్తాన్ని గ్రూప్ రానున్న నాలుగేళ్లలో పెట్టుబడుల రూపంలో పెడుతుందని యూపీ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో వెల్లడించారు. ఈ మెగా పెట్టుబడుల నిర్ణయం ద్వారా రానున్న కాలంలో ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది.
అంబానీ ఏమన్నారంటే..
సమావేశంలో మాట్లాడిన రిలయన్స్ గ్రూప్ అధినేత డిసెంబర్ 2023 చివరి నాటికి యూపీ వ్యాప్తంగా తమ 5జీ సేవలను జియో అందుబాటులోకి తెస్తుందని వెల్లడించారు. ఆయిల్ నుంచి టెలికాం వరకు వ్యాపారాల్లో విస్తరించిన తమ గ్రూప్ రానున్న కాలంలో 10 గిగా వాట్ల సామర్థ్యం కలిగిన రెన్యూవల్ బయో ఎనర్జీ వ్యాపారాన్ని రాష్ట్రంలో ప్రారంభిస్తుందని తెలిపారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో గ్రీన్ ఎనర్జీ రంగానికి ప్రాధాన్యతను పెంచటం భారత అభివృద్ధికి పునాది వేసిందని అన్నారు.
లక్ష ఉద్యోగాలు..
ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ఫిబ్రవరి 10-12 వరకు జరుగుతుంది. దీనిని శుక్రవారం లక్నోలో ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇందులో కంపెనీ ప్రకటించిన పెట్టుబడుల ద్వారా రానున్న కాలంలో లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంబానీ తెలిపారు.
వ్యాపార దిగ్గజాలు..
యూపీ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నంలో చాలా మంది పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి శాఖ మంత్రి నంద్ గోపాల్ గుప్తా నందితో పాటు ముఖేష్ అంబానీ, కె చంద్రశేఖరన్, కుమార్ మంగళం బిర్లా, ఆనంద్ మహీంద్రా పాల్గొంటున్నారు.


Click it and Unblock the Notifications