Ambani-Adani: ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వ్యాపార విస్తరణతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో వారు ఇటీవల 5జీ స్పెక్ట్రమ్ తర్వాత నేరుగా మరో వ్యాపారంలో పోటీకి దిగుతున్నారు. అవును వారు కొనాలనుకుంటున్న కంపెనీ ఏమిటి..? దానిపైనే ఎందుకు వారికి అంత అసక్తో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖాముఖి పోటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

కుబేరుల మధ్య పోటీ..
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని బిలియనీర్ ముఖేష్ అంబానీ మరోసారి ముఖాముఖి తలపడుతున్నారు. అయితే ఈ సారి వారిద్దరి మధ్య పోటీకి కారణమైంది 'బిగ్ బజార్' వ్యాపారం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ కొనుగోలు కోసం ఇద్దరు వ్యాపారులూ పోటీ పడుతున్నారు.

భారీగా పోటీ..
దాదాపు రూ.21,000 కోట్ల కంటే ఎక్కువ రుణాలతో సతమతమవుతున్న ఫ్యూచర్ స్టోర్ల వ్యాపారాన్ని సొంతం చేసుకునేందుకు చాలా కంపెనీలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇందుకోసం మూన్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్, అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ అండ్ ఫ్లెమింగో గ్రూప్ జాయింట్ వెంచర్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ తో పాటు మరో 13 ఇతర సంస్థలు ఫ్యూచర్ రిటైల్ కోసం ఆసక్తి వ్యక్తీకరణలను(EOI) దాఖలు చేశాయి.

రెండవ రిటైల్ సంస్థ..
బిగ్ బజార్ బ్రాండ్ పేరుతో దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లను కలిగి ఉన్న ఫ్యూచర్ గ్రూప్ దాదాపు 33 రుణదాతలకు డబ్బు చెల్లించాల్సి ఉంది. ఈఓఐని సమర్పించే కంపెనీల తుది జాబితా నవంబర్ 20న విడుదల కానుంది. ఆ తర్వాత డిసెంబరు 15లోగా రిజల్యూషన్ ప్లాన్‌ను అవి సమర్పించాలని కోరనున్నట్లు సమాచారం.

రిలయన్స్ డబుల్ డీల్..
రిలయన్స్ రిటైల్ వ్యాపార బాధ్యతలను అంబానీ కుమార్తె ఈషా చేతికి వెళ్లటంతో దూకుడు మరింతగా పెరిగింది. ఈ క్రమంలో జర్మన్ క్యాష్ & క్యారీ మెట్రో బ్రాండ్ ను ఇప్పటికే దక్కించుకునేందుకు ఆసక్తి కనబరిచిన రిలయన్స్ తాజాగా ఫ్యూచర్ గ్రూప్ స్టోర్లపై కూడా కన్నేసింది. అయితే రిలయన్స్ గతంలోనే ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ అమెజాన్ చట్టపరమైన చర్యలకు వెళ్లటంతో.. కిషోర్ బియానీ కంపెనీ పరిస్థితి ఆర్థికంగా దిగజారింది. అంబానీ ఎలాగైనా స్టోర్లను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుండగా.. అదానీ రాక అడ్డుగా మారనుంది.

పెరిగిన పోటీ..
గతంలో అంబానీ, అదానీలు 5జీ స్పెక్ట్రమ్ వేలం సమయంలోనూ ముఖాముఖి పోటీలో నిలిచారు. ఆ తర్వాత మరోసారి రిటైల్ వ్యాపారంలో దూకుడును కొనసాగిస్తున్నారు. అయితే ఈ పోటీ సామాన్యులకు ఎలా లబ్ధి చేకూర్చుతుందో తెలియాల్సి ఉంది. ఇదే జరిగితే ఫ్యూచర్ గ్రూప్ కంపెనీ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు మంచి కాలం వస్తుందని చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications