Motilal Oswal: దేశంలో స్టాక్ మార్కెట్లలో జాబితా చేయబడిన కంపెనీలు వరుసగా తమ మార్చి త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు ఊహించని రాబడులను బోనస్, డివిడెండ్ రూపంలో అందిస్తున్నాయి.
ఈ క్రమంలో మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన పెట్టుబడిదారులకు భారీ బహుమతిని ప్రకటించింది. కంపెనీ తన ఇన్వెస్టర్లకు ప్రతి షేరుపై మూడు ఉచిత బోనస్ షేర్లను ప్రకటించింది. వాస్తవానికి కంపెనీ బోనస్ షేర్లను ప్రకటించటం ఇదే తొలిసారి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ ఇంకా బోనస్ షేర్ల రికార్డు తేదీ వివరాలను ప్రకటించలేదు. ఈ వార్తతో కంపెనీ షేర్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో 5 శాతానికి పైగా లాభపడి రూ.2,600.65 వద్ద ప్రయాణాన్ని ముగించింది.

మార్చి 2024 త్రైమాసికంలో దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాభాల్లో 334% భారీ జంప్ నమోదు చేసింది. కంపెనీ జనవరి-మార్చి 2024 త్రైమాసికంలో రూ.724.6 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు ఫలితాల ప్రకటనలో తెలిపింది. గడచిన ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.167 కోట్లుగా ఉంది. మార్చి 2024 త్రైమాసికంలో మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 108% పెరిగి రూ.2,141.3 కోట్లకు చేరుకుంది. గడచిన ఏడాది ఇదే కాలంలో రూ.1,027.4 కోట్లుగా ఉంది.
షేర్ ధర ర్యాలీని గమనిస్తే ఒక ఏడాది కాలంలో స్టాక్ ఏకంగా 315 శాతం పెరుగుదలను నమోదు చేసింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ షేర్లు ఏప్రిల్ 27, 2023న రూ.626.55 వద్ద ఉన్నాయి. దేశీయ బ్రోకరేజ్ సంస్థ షేర్లు ఏప్రిల్ 26, 2024న రూ.2,600.65 వద్ద ముగిశాయి. గత 6 నెలల్లో కంపెనీ షేర్లు 168% కంటే ఎక్కువ పెరిగాయి. కంపెనీ స్టాక్ 27 అక్టోబర్ 2023న రూ.969.50 వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఇప్పటివరకు కంపెనీ షేర్లు 107 శాతం పెరిగాయి. అంటే.. ఈ ఏడాది కేవలం 4 నెలల్లోనే కంపెనీ షేర్లు ఇన్వెస్టర్ల సొమ్మును రెట్టింపు చేశాయి.


Click it and Unblock the Notifications