UPI News: UPI విషయంలో PSBల చెత్త రికార్డ్.. RBI ఆదేశించినా వినట్లే..
Payment failures: భారత చెల్లింపు వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సంచలనం సృష్టించింది. రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరాన్ని సమూలంగా మార్చివేసింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందుబాటులో ఉన్నా, సామాన్యుల వినియోగానికి అంత అనువుగా ఉండేది కాదు. కామీ UPI ఎంట్రీతో నడిరోడ్డుపై కేవలం సెకన్ల వ్యవధిలోనే అరచేతిలో లావాదేవీలు జరిపే వెసులుబాటు లభించింది.
ఈ పోర్టబుల్ ఎకోసిస్టమ్ తెగనచ్చేయడంతో పలు దేశాలు తన ప్రాంతాల్లో UPI సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారత్‌తో చేతులు కలిపాయి. ఇంత గొప్ప స్థాయిలో ఉన్న చెల్లింపు వ్యవస్థను ఓ ఇబ్బంది వెంటాడుతోంది. అదే పేమెంట్ ఫెయిల్యూర్. ఇది కాస్తా ఈ వ్యవస్థ భవిష్యత్ విస్తరణపై దుష్ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా ప్రకారం.. ప్రైవేట్ రుణదాతలతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల UPI సిస్టమ్‌లలో సాంకేతిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి తమ UPI సిస్టమ్‌లలో 1 శాతం కంటే ఎక్కువ టెక్నికల్ ఫెయిల్యూర్స్ కలిగి ఉన్న PSBలలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి.
HDFC బ్యాంక్, యాక్సిస్, ICICI, యెస్ బ్యాంక్ మరియు IDFC ఫస్ట్ వంటి ప్రైవేట్ ప్లేయర్‌ల సగటు UPI ఫెయిల్యూర్స్ 0.04 శాతం మాత్రమే కావడం గమనార్హం. అయితే వీటిలోనూ బంధన్ బ్యాంక్ 1 శాతానికి పైగా సాంకేతిక క్షీణతను ఎదుర్కొంది. ఈ తరహా ఫెయిల్యూర్స్‌ను 1 శాతం కంటే తక్కువకు తగ్గించుకోవాలని RBI గతంలో ఆయా బ్యాంకులకు సూచించింది. భవిష్యత్తులో ఏ మేరకు సదరు బ్యాంకులు చర్యలు తీసుకుంటాయో చూడాలి మరి.


Click it and Unblock the Notifications