4 రోజుల్లోనే రూ.19.49 లక్షల కోట్ల సంపద ఆవిరి, ఏడాది కనిష్టానికి 1200 కంపెనీలు
మార్కెట్లు వరుసగా నష్టపోతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో కోల్పోతున్నారు. ఈ వారంలో సోమవారం నుండి గురువారం వరకు 4 రోజుల్లోనే ఇన్వెస్టర్లు రూ.19.49 లక్షల కోట్లు నష్టపోయారు. అంతకుముందు రెండు రోజుల్లోనే రూ.11 లక్షల కోట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 10వేల మందికి పైగా చనిపోగా, రెండున్నర లక్షల మందికి సోకింది. ఇందులో 90 వేల మంది వరకు కోలుకున్నారు.

నాలుగు రోజుల్లోనే అపార నష్టం
కరోనా కేసులు ప్రపంచవ్యాప్తంగా.. అలాగే దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. షేర్లను అమ్ముకునేందుకు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. దీంతో మార్కెట్లలో వరుస పతనాలు నమోదవుతున్నాయి. గురువారం (మార్చి 19) పతనంతో వరుసగా 4 రోజులు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతోనే ముగిశాయి. దీంతో రూ.19,49,461.82 కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.

భారీగా తగ్గుతున్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ
బీఎస్ఈలో నమోదైన లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వ్యాల్యూ రూ.19,49,641.82 కోట్లు తగ్గి రూ.1,09,76,781 కోట్లకు దిగజారింది. నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 5,815.25 పాయింట్లు నష్టపోయింది. 30 షేర్ బీఎస్ఈ ఇండెక్స్ గురువారం 581.28 పాయింట్ల వద్ద క్లోజైంది. నాలుగు రోజుల్లో ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ 5,815.25 పాయింట్లు పడిపోయింది.

ఏడాది కనిష్టానికి..
అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాల్లోకి వెళ్లడం మనంపై ఎక్కువగా ప్రభావం చూపుతోందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ వరుసగా 3.70 శాతం, 4.53 శాతం పడిపోయింది. బీఎస్ఈలో గురువారం నాడు 1,828 కంపెనీలు నష్టాల్లో, 574 కంపెనీలు లాభాల్లో ఉండగా, 146 కంపెనీల్లో మార్పు లేదు. ఇందులో దాదాపు 1200 కంపెనీలు ఏడాది కనిష్టానికి చేరుకున్నాయి.


Click it and Unblock the Notifications