విశాఖపట్నం: అరకు కాఫీ.. అతి తక్కువ కాలంలో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన బ్రాండ్. భారత్‌లో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల మేర కాఫీ ఉత్పత్తి చోటు చేసుకుంటోండగా..అందులో ఎక్కువ భాగం దక్షిణాది రాష్ట్రాల్లోనివే. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్ నుంచి కాఫీ ఉత్పత్తి అధికంగా ఉంటోంది. దేశంలో మొత్తంగా 12 రాష్ట్రాలు కాఫీని ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రపంచంలో కాఫీని అత్యధికంగా పండించే దేశాల్లో భారత్ ఏడో స్థానంలో కొనసాగుతోంది. 25 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ ఉత్పత్తితో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది.
ఏపీలో కాఫీ అనగానే గుర్తుకొచ్చేది అరకు ఒక్కటే. ఇక్కడ కాఫీ గింజలు విస్తారంగా పండుతాయి. సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం కావడం, గిరిజన కుటుంబాలు దీన్ని పండిస్తుండటం వల్ల దీనికి ఆ ఖ్యాతి ఏర్పడింది. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా, సేంద్రీయ పద్ధతుల్లో గిరిజనులు అరకు కాఫీని ఉత్పత్తి చేస్తుంటారు. వారు పండించే విధానం వ్యవసాయంలో ఓ పాఠంలా మారిందంటూ ఇదివరకే ప్రశంసలు సైతం లభించాయి.

లక్షమందికి పైగా గిరిజనులు అరకులోయ ఏజెన్సీ ప్రాంతంలో పండించే కాఫీ తోటలపై ఆధారపడి ఉన్నారు. పేదరికం నుంచి బయటపడ్డారు. సంప్రదాయ పద్ధతుల్లో కాఫీని సాగుచేస్తూ అరకు కాపీ బ్రాండ్ నేమ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగారు. ప్రస్తుతం అరకు లోయలో 30 మిలియన్లకు పైగా కాఫీ మొక్కలు సాగవుతున్నాయి. అత్యంత నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తి ఇక్కడ సాగుతోంది. నాణ్యతలో 94.7 శాతం మేర స్కోరును సాధించాయి ఇక్కడి కాఫీ గింజలు.
తాజాగా అరకు కాఫీని దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఆకాశానికెత్తేశారు. అదొక అద్భుతం అంటూ ప్రశంసించారు. అరకు కాఫీకి సంబంధించిన కొంత్ గ్లింప్సెస్‌ను గుర్తు చేస్తూ నాంది ఫౌండేషన్ పోస్ట్ చేసిన ఓ ట్వీట్‌ను ఆనంద్ మహీంద్ర రీట్వీట్ చేశారు. దానికి తన అభిప్రాయాన్ని జోడించారు. మోర్ దెన్ జస్ట్ ఎ కప్ ఆఫ్ కాఫీ.. ఇట్స్ ఎ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్.. అంటూ కామెంట్ చేశారు ఆనంద్ మహీంద్ర. ఆయన అరకు కాఫీ గురించి ప్రస్తావించడం కొత్త కాదు. సందర్భం వచ్చిన ప్రతీసారి దీని గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు.


Click it and Unblock the Notifications